జాతీయ జూనియర్ చెస్ చాంప్ హర్ష
పట్నా: జాతీయ జూనియర్ అండర్–19 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు హర్ష భరతకోటి విజేతగా నిలిచాడు. 11 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో అతను 9.5 పాయింట్లతో అజేయంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్ వెంకట రామన్ కూడా సరిగ్గా 9.5 పాయింట్లు సాధించాడు. అయితే ఈ టోర్నీలో అతనిపై ముఖాముఖి పోరులో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎమ్) హర్ష గెలుపొందడంతో అతడిని విజేతగా డిక్లేర్ చేశారు.
దీంతో కార్తీక్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో టాప్–5 స్థానాలు తెలుగు ఆటగాళ్లవే కావడం విశేషం. ఏపీ క్రీడాకారులు కృష్ణతేజ (8), ప్రణవానంద (8) వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందగా, రాజా రిత్విక్ (తెలంగాణ) ఐదో స్థానంలో నిలిచాడు. బాలికల కేటగిరీలో మహాలక్ష్మి (తమిళనాడు) చాంపియన్‌గా నిలిచింది.