ప్రతి బంతీ ఓ యుద్ధంలా...
న్యూఢిల్లీ: ఆసియా కప్ అండర్-19 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రతి బంతి ఓ యుద్ధాన్ని తలపిం చిందని భారత అండర్-19 సారథి విజయ్ జోల్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్ సంజూ శామ్సన్ సెంచరీలతో కదంతొక్కడంతో భారత్ 40 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచిన సంగతి తెలిసిందే. ‘దాయాదుల సమరంలో తీవ్రమైన ఉద్వేగం ఉంటుంది. ప్రతి బంతి యుద్ధంలా ఉంటుంది. ఇది మ్యాచ్ ఆరంభంలో కొంత ఇబ్బందిగా అనిపించింది. దానికి ప్రేక్షకుల గోల కూడా తోడయ్యింది... కానీ మ్యాచ్ సాగేకొద్దీ అంతా సర్దుకుంది’ అని జోల్ చెప్పాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా, పాక్‌తో మ్యాచ్ అంటే ఆషామాషీ కాదన్నాడు.
ఈ విషయం తమకు బాగా తెలుసు కాబట్టే చక్కగా ఆరంభించామన్నాడు. మధ్యలో కాస్త ఇబ్బందికర పరిస్థితులెదురైనప్పటికీ తాను క్రీజ్‌లోకి వెళ్లి అనుకున్న ప్రణాళికను అమలు చేయడంతో అంతా సర్దుకుందని అన్నాడు. ‘ముందుగా మా బ్యాటింగ్ ముగిశాక, ఇన్నింగ్స్ విరామంలో అంతా కూర్చుని మాట్లాడుకున్నాం. బ్యాట్స్‌మెన్ తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారని... ఇప్పుడిక బౌలర్ల వంతని చెప్పుకున్నాం. అనుకున్నట్లే బౌలర్లూ బాగా రాణించారు. నిజానికి టోర్నీ ఆసాంతం మా వాళ్లు బాగా బౌలింగ్ చేశారు’ అని మ్యాచ్ విశేషాల్ని జోల్ వివరించాడు.