under 23 cricket matches
-
అభిరత్, చైతన్య సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సౌత్‌జోన్ పురుషుల అండర్–23 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో కేరళ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్... రెండో మ్యాచ్‌లో గోవాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పచియప్పస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ అభిరత్ రెడ్డి (97 బంతుల్లో 110 నాటౌట్; 14 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా, పీఎస్ చైతన్య రెడ్డి (73 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడైన శతకంతో కదం తొక్కాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గోవా 49.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. సుయశ్ ప్రభు దేశాయ్ (102 బంతుల్లో 92; 9 ఫోర్లు, ఒక సిక్స్) కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. వీజీ కహ్లాన్ (81 బంతుల్లో 60; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 118 పరుగుల్ని జోడించి జట్టుకు ఓ మోస్తరు స్కోరును అందించారు. హైదరాబాద్ బౌలర్లలో టి. రవితేజ 3 వికెట్లు దక్కించుకున్నాడు. కార్తికేయ, వై. శ్రవణ్ కుమార్, తనయ్ త్యాగరాజన్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్ 254 పరుగుల లక్ష్యాన్ని 34.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిరత్ రెడ్డి, చైతన్య రెడ్డి బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ బుద్ధి (15), ఎ. వరుణ్ గౌడ్ (22 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. గోవా బౌలర్లలో ఫెలిక్స్, వీఏ నాయక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. బుధవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో కర్ణాటకతో హైదరాబాద్ తలపడుతుంది. -
అదరగొట్టిన ఆంధ్రా
కడప స్పోర్ట్స్: ఆంధ్రా బ్యాట్స్‌మన్ ప్రణీత్ డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో ఆంధ్రాజట్టు పంజాబ్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కల్నల్ సీకే నాయుడు అండర్–23 స్టేట్మ్యాచ్లలో ఆంధ్రా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి 3 పాయింట్లు కైవసం చేసుకోగా పంజాబ్ జట్టుకు 1 పాయింట్ లభించింది. 74 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆంధ్రాజట్టు బ్యాట్స్‌మన్ ప్రణీత్ 25 ఫోర్లు 2 సిక్సర్లతో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 297 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆంధ్రా బ్యాట్స్‌మన్ చివరిరోజు చెలరేగడంతో 502 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. పంజాబ్ బౌలర్లు సుఖ్వీందర్, ఆర్పిత్‌పన్ను, ఎన్.చౌదరి తలా రెండు వికెట్లు తీశారు. కాగా ఓవర్‌నైట్ ఆంధ్రా బ్యాట్స్‌మన్ ప్రణీత్ 208, శశికాంత్ 76 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 501 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆసక్తికరంగా మ్యాచ్: ఏసీఏ ఉపాధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి ఆంధ్రా–పంజాబ్ జట్ల మధ్య నిర్వహించిన మ్యాచ్ ఆధ్యంతం ఆసక్తిగా సాగిందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి అన్నారు. మైదానంలో తొలిసారి డబుల్ సెంచరీ నమోదు కావడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రా జట్టు ఆటతీరుపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ప్రణీత్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, సభ్యులు పాల్గొన్నారు.