అదరగొట్టిన ఆంధ్రా | andhra lead by punjab in first innings | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన ఆంధ్రా

Published Thu, Oct 13 2016 9:56 PM | Last Updated on Sat, Aug 18 2018 4:23 PM

అదరగొట్టిన ఆంధ్రా - Sakshi

అదరగొట్టిన ఆంధ్రా

 కడప స్పోర్ట్స్‌:

ఆంధ్రా బ్యాట్స్‌మన్‌ ప్రణీత్‌ డబుల్‌ సెంచరీతో అదరగొట్టడంతో ఆంధ్రాజట్టు పంజాబ్‌పై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో నిలిచింది. నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 స్టేట్‌మ్యాచ్‌లలో ఆంధ్రా జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించి 3 పాయింట్లు కైవసం చేసుకోగా పంజాబ్‌ జట్టుకు 1 పాయింట్‌ లభించింది. 74 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన ఆంధ్రాజట్టు బ్యాట్స్‌మన్‌ ప్రణీత్‌ 25 ఫోర్లు 2 సిక్సర్లతో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 297 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన ఆంధ్రా బ్యాట్స్‌మన్‌ చివరిరోజు చెలరేగడంతో 502 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. పంజాబ్‌ బౌలర్లు సుఖ్వీందర్, ఆర్పిత్‌పన్ను, ఎన్‌.చౌదరి తలా రెండు వికెట్లు తీశారు. కాగా ఓవర్‌నైట్‌ ఆంధ్రా బ్యాట్స్‌మన్‌ ప్రణీత్‌ 208, శశికాంత్‌ 76 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌ 501 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే.
ఆసక్తికరంగా మ్యాచ్‌: ఏసీఏ ఉపాధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి
ఆంధ్రా–పంజాబ్‌ జట్ల మధ్య నిర్వహించిన మ్యాచ్‌ ఆధ్యంతం ఆసక్తిగా సాగిందని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి అన్నారు. మైదానంలో తొలిసారి డబుల్‌ సెంచరీ నమోదు కావడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రా జట్టు ఆటతీరుపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ప్రణీత్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సౌత్‌జోన్‌ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, సభ్యులు పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement