గృహ నిర్బంధంలో మెహబూబా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆందోళనలు జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలను అదుపులోకి తీసుకుంది. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని గృహ నిర్బంధంలో ఉంచింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితులున్నాయంటూ సుప్రీంకోర్టుకు చెబుతున్న కేంద్రం.. ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మెహబూబా ట్వీట్ చేశారు.
ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరుతూ భారీ హోర్డింగులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..మరో వైపు ప్రజల నిజమైన ఆకాంక్షలను అణగదొక్కుతోందన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సమయంలో ఇలాంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. తాము శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వలేదని పీడీపీ తెలిపింది. రాజ్భాగ్లో కొందరు పీడీపీ కార్యకర్తలు ‘ఆగస్ట్ 5 బ్లాక్ డే’అనే ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. కాగా, శ్రీనగర్‌లోని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫీస్‌లను పోలీసులు మూసివేశారు.