ఆ కోరిక తీరలేదు!
జీవితమే ఒక ఆశ. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ఆశల పల్లకిలో ఊరేగడం మనిషి సహజగుణం. కొత్త ఏడాది వస్తుందంటే గతానికి గుడ్‌బై చెప్పి భవిష్యత్తు బంగారంలా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అలా కోట్లాది ప్రజానీకం కోరికలను, ఆశలను వెంటబెట్టుకుని వచ్చేసింది కొత్త ఏడాది 2017. మరి ఈ నవ వసంతం ఎవరి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతుందో చూడాలి. ఇక నటి సమంతకు మాత్రం మరపురాని సంవత్సరంగా మారనుంది. చాలా కాలంగా ప్రేమిస్తున్న తన ప్రియుడు నాగచైతన్యతో మూడు ముళ్లు, ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతున్నారు. 2016 కూడా తనకు విజయవంతమైన ఏడాదిగా నిలిచిందంటున్న సమంత మనోభావాలను చూద్దాం. కొత్త ఏడాది మరింత ఉన్నతమైన పాత్రల్లో నటిస్తాను.
గతేడాదిలోనూ మంచి చిత్రాలు వచ్చాయి. అభినందనలు అందుకున్నాను. తమిళంలో 24, తెరి చిత్రాల్లో విభిన్న పాత్రలు చేశాను. తెరి చిత్రంలో అయితే తాను చనిపోయిన సన్నివేశం చాలామందిని ఏడిపించింది. అది నా నటనకు లభించిన ప్రశంసగా భావిస్తున్నాను. సినిమాల్లో నేను చాలా అందంగా కనిపిస్తున్నాను అని అంటున్నారు. అందుకు ప్రధాన కారణం ఛాయాగ్రాహకులే. నెరవేరని కోరిక అంటే దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించకపోవడమే. అలాంటి అదృష్టం ఒక సారి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అనివార్యకారణాల వల్లే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. అది తలచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుంది.
అయితే అలాంటి అవకాశం ఈ ఏడాది వస్తుందనే నమ్మకంతో ఉన్నాను. కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లో నటిస్తారా అని అడుగుతున్నారు. మంచి కథా పాత్రల్లో నటించాలన్నదే నా ఆశ. అలాంటి కథలను ఎంపిక చేసుకునే పనిలోనే ఉన్నాను. అయితే కథానాయకికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తాని మొండిపట్టు పట్టను. అలాంటి పాత్రలను వెతుక్కుంటూ పరిగెత్తను. గత ఏడాది ఐదు చిత్రాల్లో నటించాను.ఈ ఏడాది కచ్చితంగా మరింత ఉన్నతమైన పాత్రల్లో నటిస్తాను.