ungatur
-
బాదంపూడి చెక్ పోస్టు వద్ద ఉద్రిక్తత
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి చెక్ పోస్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్నదాతల ఆక్రోశంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలానికి చెందిన రైతులు, కౌలు రైతులు బాదంపూడి జాతీయ రహదారిని నిర్బంధించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకుండా రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కయి.. తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో దాదాపు నాలుగు గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వాటిని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గతంలో బస్తా రూ. 1300 కొనేవారని, ఇప్పుడు బస్తాకు రూ.1100కి మించి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 1010 రకం ధాన్యాన్ని తాము పండిస్తుండగా.. వ్యవసాయ అధికారులు తమ వద్దకు వచ్చి 1026, 1056 రకం ధాన్యం పండించాలని తమకు చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వం కానీ, రైస్ మిల్లర్లు కానీ ఆ ధాన్యాన్ని కొనడం లేదని రైతులు తెలిపారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు తమకు వేరేదారి లేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రహదారిని నిర్బంధించి నిరసన తెలిపామని చెప్పారు. నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీస్ గోబ్యాక్ అన్న నినాదాలతో జాతీయ రహదారి కొంతసేపు మార్మోగింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఆందోళనకారులను చెల్లాచెదురుచేసి కొంతమంది రైతునాయకులు అదుపులోకి తీసుకుని చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఉంగుటూరు మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
వైఎస్ఆర్సీపీ నేతపై దౌర్జన్యం, ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత వింత శ్రీనివాసరెడ్డిపై గ్రామ సర్పంచ్ భర్త రాము దౌర్జన్యానికి దిగారు. కారుతో ఢీకొట్టి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. సర్పంచ్ భర్త తీరుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాము కారు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి జాతీయ రహదారిపై ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. తెనాలికి చెందిన రైస్ మిల్ యజమాని గుర్రం వెంకట దుర్గాప్రసాద్ అతని బంధువులతో కలిసి తన మనవరాలు పెళ్లి చూపులు నిమిత్తం వైజాగ్ వెళ్లి ఇన్నోవా కారులో తెనాలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాదంపుడి సమీపంలోని దత్తాశ్రమం వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్రం వెంకట దుర్గాప్రసాద్(68), గుర్రం వెంకట రత్నం(55) దంపతులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తెనాలి, తాడేపల్లిగూడెం ఆస్పత్రులకు తలరించారు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయింది. నిన్న విశాఖపట్నంలో ఎంతో ఆనందంగా పెళ్లి చూపులు ముగించుకుని తిరుగు ప్రయాణమయిన వీరిని మృత్యువు లారీ రూపంలో తీసుకుపోయింది. ఈ ప్రమాద ఘటన తెలుసుకుని ఇటు తెనాలి, అటు వైజాగ్ కు చెందిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.