శ్రీవారి గుడిలో మూడు గుర్రాలకు అనారోగ్యం
సాక్షి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దివ్య క్షేత్రంలో శ్రీవారి సేవల్లో పాలుపంచుకునే మూడు అశ్వాలు ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. మేత తిన్న కొద్ది సమయానికే అవి కుప్పకూలిపోయాయి. దీన్ని గమనించిన ఆలయ అధికారులు పశువైద్యాధికారుల సాయంతో చికిత్సనందించారు. అయితే అందులో ’అశ్వ’ అనే గుర్రం చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతిచెందింది. మరో అశ్వం ఇంకా చికిత్స పొందుతోంది. మూడో అశ్వం పూర్తిగా కోలుకుంది. స్వామికి సేవలందించే అశ్వాలకు ఇలా జరగడంపై పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా మోర్చ జాతీయ కార్యదర్శి శరణాల మాలతీరాణి చినవెంకన్న సేవకోసం 20 నెలల క్రితం అశ్వ, శ్వేత అనే రెండు (తెల్లరంగు)మగ అశ్వాలను ఆలయానికి బహూకరించారు. అలాగే ద్వారకాతిరుమలకు చెందిన దేవస్థానం ఉద్యోగి శోభనగిరి 18 నెలల క్రితం యోగిని అనే ఆడ అశ్వాన్ని ఆలయానికి బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఆలయ అధికారులు వాటిని శ్రీవారి తిరువీధి సేవలకు, అలాగే ధనుర్మాస, కనుమ, బ్రహ్మోత్సవాలకు వినియోగిస్తున్నారు. శేషాచలకొండపైన గోసంరక్షణశాలలోనే ఈ అశ్వాలను అధికారులు సంరక్షిస్తున్నారు.
అరగకపోవడం వల్లే..
ఒకేసారి ఈ మూడు అశ్వాలు అస్వస్థతకు గురి కావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అవి తిన్న ఆహారంలో ఏమైనా విషపు గుళికలు కలిశాయా.. అన్న సందేహాలు కలిగాయి. అయితే మృతిచెందిన అశ్వానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ జి.నాగేంద్ర మాట్లాడుతూ తిన్న మేత అరగకపోవడం వల్లే అశ్వాలు అస్వస్థతకు గురయ్యాయని, ఊపిరందక ఒక అశ్వం మృత్యువాత పడిందని తెలిపారు. అయితే అవి తిన్న మేతలో సాలీళ్లు ఉండటం వల్లే ఇలా జరిగుండొచ్చని చెప్పారు.
వైభవాన్ని చాటే అశ్వాలు..
ఆలయానికి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ అశ్వాలు శ్రీవారి ఉత్సవాల వైభవాన్ని చాటాయి. స్వామి వాహనానికి ముందు గజ లక్ష్మి (ఏనుగు)తో కలసి ఈ అశ్వాలు నడుస్తూ కనువిందు చేసేవి. ఒక అశ్వం మృతిచెందడం, మరో అశ్వం ఇంకా చికిత్స పొందుతుండటం పట్ల భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.