ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
గీసుకొండ(పరకాల): అనారోగ్య సమస్యలతో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి గ్రేటర్ వరంగల్ పరిధిలోని 3వ డివిజన్ కీర్తినగర్‌లో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం కొంపాక ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు గోలి భవానీదేవి(53) తన భర్త, పిల్లలతో కలిసి కీర్తినగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీలో నివాసముంటోంది. కాగా ఆమె కొంతకాలంగా థైరాయిడ్, కడుపు నొప్పి తదితర సమస్యలతో బాధపడుతోంది. ఆ బాధను భరించలేక జీవితంపై విరక్తి చెందిన భవానీదేవి.. తన ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఆర్చి కర్టెన్ రాడ్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తెల్లవారుజామున నిద్రలేచిన బంధువులు.. ఆమెను కిందకు దింపి చూడడంతో అప్పటికే ఆమె మృతిచెంది ఉంది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. కాగా భవానీదేవి.. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మృతికి ఎవరూ కారణం కాదని, తనను క్షమించండి అని సూసైడ్ నోట్ రాసిందని బంధువులు తెలిపారు. కాగా డీఈఓ నారాయణరెడ్డి, పలువురు ఉపాధ్యాయులు భవానీదేవి మృతదేహాన్ని సందర్శించి బంధువులను పరామర్శించారు.