ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన
గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపొద్దు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
పాల్వంచ: జిల్లాల పునర్విభజనలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోకుండానే జిల్లాల పేర్లను కూడా ప్రకటించారని, సరైన నైసర్గిక స్వరూపాలు లేకుండానే విభజించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన గురువారం ఇక్కడ సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలను ప్రకటిత మహబూబాబాద్ జిల్లాలో కలపడం సరికాదన్నారు. కొన్ని నియోజకవర్గాలను మూడు ముక్కలు చేశారని అన్నారు. మోడీ ప్రభుత్వం ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ అని నినదిస్తూనే, మరోవైపు రక్షణ, రైల్వే, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోకి విదేశీ పెట్టుబడులను ప్రొత్సíß స్తోందని.. మున్ముందు వీటిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు సాగిస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రూ.10లక్షల కోట్లు రాయితీగా ఇచ్చిందన్నారు. అధికారంలోకి వస్తే కార్మికులను ఆదుకుంటామని చెప్పిన బీజేపీ పెద్దలు.. గద్దెనెక్కాక అదే కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే, మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెకు 10 జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న ప్రతిపక్షాలను జైళ్లల్లో పెడతామని కేసీఆర్ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. డబ్బు దండుకునేందుకే దుమ్మగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.2,500 కోట్ల నుంచి రూ.8000 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్‌పాషా, కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, బరిగెల సాయిలు, మండే వీరహన్మంతరావు, పూర్ణచందర్రావు, ఆదాం, దుర్గాఅశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.