‘నీట్’ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతికి వివరణ
నడ్డాను మరింత సమాచారం కోరిన ప్రణబ్
న్యూఢిల్లీ: ‘నీట్’ ఆర్డినెన్స్‌పై మరింత సమాచారంతో పాటు కొన్ని అంశాలపై వివరణివ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ఆర్డినెన్స్‌పై వివరణిచ్చేందుకు నడ్డా సోమవారం రాష్ట్రపతిని కలిశారు. అరగంట సేపు జరిగిన భేటీలో మూడు అంశాలపై రాష్ట్రపతి సందేహాలకు మంత్రి సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల బోర్డులు నిర్వహిస్తోన్న ప్రవేశ పరీక్షలు, సిలబస్, ప్రాంతీయ భాషలు నీట్‌కు అడ్డంకిగా మారినట్లు నడ్డా చెప్పారని, సమావేశం సంతృప్తికరంగా సాగిందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. గత శుక్రవారమే ఆర్డినెన్స్‌ను ఆమోదించిన కేంద్ర కేబినెట్ శనివారం రాష్ట్రపతికి పంపింది.
ప్రణబ్ మంగళవారం చైనా వెళ్తుండడంతో ఆ లోపే ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రం పావులు కదిపింది. మరోవైపు నీట్‌పై ప్రణబ్ న్యాయ సలహాలూ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలతో పాటు డీమ్డ్ వర్సిటీల్లో నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించాల్సిందేనన్న సుప్రీం తీర్పులో మార్పులు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. నీట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాల సీట్లతో పాటు ప్రైవేట్ కాలేజీల్లో రాష్ట్రాల కోటా సీట్లనూ మినహాయించారు.