భారీ విధ్వంసానికి మావోల కుట్ర!
ఎన్నికల సందర్భంగా
రంగంలోకి యాక్షన్టీమ్లు
అప్రమత్తంగా ఉండాలని నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ హెచ్చరిక
హదరాబాద్: ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు భారీఎత్తున విధ్వంసానికి కుట్రపన్నారని, ఇందుకోసం దేశంలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో రెక్కీని కూడా నిర్వహించారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవల ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా వంటి ప్రభావిత రాష్ట్రాల్లో మావోయిస్టులు విధ్వంసం, పారామిలటరీ దళాలను మందుపాతరలతో హతమార్చడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దూకుడును కొనసాగిస్తూనే ఎన్నికల సందర్భంగా భారీ విధ్వంసానికి మావోయిస్టులు కుట్ర పన్నినట్లు కేంద్ర హోంశాఖకు కీలక సమాచారం అందింది. అంతేగాక కొన్నిప్రాంతాల్లో అవసరమైతే అధికార పక్షానికి చెందిన అభ్యర్థులను కూడా కిడ్నాప్ చేసేందుకు వ్యూహరచన చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌సహా ఇతర ప్రభావిత రాష్ట్రాల్లోని దాదాపు 30జిల్లాలపై మావోయిస్టులు కన్నేశారని అందిన సమాచారం బట్టి తెలుస్తోంది.
దీనికి పూర్వమే ఏ ప్రాంతంలో ఎలాంటి చర్యకు దిగాలనే విషయమై మావోయిస్టులు రెక్కి కూడా నిర్వహించినట్లు సమాచారం. దీని ఆధారంగా దాడులకు పూనుకోవడానికి ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన స్పెషల్ యాక్షన్ టీమ్‌లను కూడా రంగంలోకి దింపారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ, సుకుమ, సరిహద్దులను ఆనుకుని ఉన్న ఖమ్మం, వరంగల్ జిల్లాలు, అటు ఒడిశాను ఆనుకుని ఉన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర గ్రేహౌండ్స్‌ను మరింత అప్రమత్తం చేశారు.