Union Minister Arun Jaitley
-
‘రక్షణ శాఖ’ భూములివ్వండి
స్కైవేల నిర్మాణానికి కంటోన్మెంట్ భూములు బదలాయించండి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ని కోరిన మంత్రి కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: స్కైవేల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ అధీనంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని మంత్రి కేటీఆర్ కోరారు. ఢిల్లీలో ఆదివారం జైట్లీతో సమావేశమై కంటోన్మెంట్ ఏరియా మీదుగా స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్రానికి అందించాలని, భూమికి బదులుగా భూమి ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని కేటీఆర్ వివరించారు. కేటీఆర్‌తో పాటుగా ఎంపీలు బి.వినోద్, జితేందర్ రెడ్డి, తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్నారు. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి కరీంనగర్ వరకూ నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారుల కూ కంటోన్మెంట్ భూములు అవసరమని కేటీఆర్ వివరించారు. ఎయిమ్స్ పనులు ప్రారంభించడానికి నిధులు కేటాయించాలని కోరారు. ఎయిమ్స్ నిధుల అంశంతో పాటు కంటోన్మెంట్ ఏరియాలో రహదారుల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామ ని జైట్లీ హామీ ఇచ్చారని వినోద్ తెలిపారు. సోమవారం కేంద్ర మంత్రులు హర్సిమ్రత్ కౌర్, మనోజ్ సిన్హాతో కేటీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. -
పెరుగుతున్న వార్తాపత్రికలు
దేశంలో లక్షకు పైగా రిజిస్టర్డ్ పబ్లికేషన్స్ న్యూఢిల్లీ: దేశంలో ఇంగ్లిష్, ప్రాంతీయ వార్తా పత్రిక సంఖ్య పెరుగుతోంది. 2013 మార్చి నాటికి రిజిస్టర్ అయిన పత్రికలు 94,067 కాగా,ఈ ఏడాది మార్చి నాటికి అవి 1,05,443కి పెరిగాయి. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఇన్ ఇండియా (ఆర్ఎన్ఐ) గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఇదే సరళి ఉంది. వార్తాపత్రికలపై ఇటీవల లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఆర్ఎన్ఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 16,130 రిజిస్టర్డ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(14,394) ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 5,575గా ఉండే పత్రికలు.. ఈ ఏడాది మార్చినాటికి 6,215 అయ్యాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో 203 రిజిస్టర్డ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. -
డిజిన్వెస్ట్‌మెంట్‌పై వెనక్కి తగ్గం
ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతోంది... స్టాక్ మార్కెట్లో స్థిరత్వం వస్తుంది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ముందుగా నిర్ణయించినట్లు యథాప్రకారం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో మార్కెట్లలో మరింత స్థిరత్వం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్ రోజువారీ కదలికల గురించి తాను పెద్దగా పట్టించుకోనన్నారు. ఏదైతేనేం.. ఎకానమీ రికవర్ అవుతుండటంతో డిజిన్వెస్ట్‌మెంట్‌పై ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెడుతుందని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా దాదాపు రూ. 69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 41,000 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ. 28,500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. అయితే, స్టాక్ మార్కెట్లు పతనమవుతుండటం , వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చన్న అంచనాలతో ఈ లక్ష్యం కష్టసాధ్యమని ప్రభుత్వ వర్గాలు సైతం భావిస్తున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వర్షాభావంపై ఆందోళనలొద్దు.. వర్షాభావంపై గానీ, దాని ప్రభావంతో ద్రవ్యోల్బణం ఎగియవచ్చని గానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని జైట్లీ చెప్పారు. వాస్తవ పరిస్థితిని మరీ అతిగా చేసి చూపిస్తున్నారని, ఇవన్నీ అపోహలేనని చెప్పారు. వర్షాభావం వల్ల ఆహారధాన్యాల దిగుబడిపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగి నన్ని ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఈసారి వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా 88% మాత్రమే ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. ‘‘ఎకానమీ మెరుగుపడుతోందనడానికి సానుకూల సంకేతాలున్నాయి. ఇటీవలి వృద్ధి రేటు గణాంకాలూ వాటిలో భాగమే. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నాయి. రాబోయే నెలల్లో మరింత పెరుగుదల ఉంటుంది. పరోక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయి. నిల్చిపోయిన ప్రాజెక్టులు మళ్లీ మొదలవుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిలు కూడా తగ్గుతున్నాయి’’ అని వివరించారు. స్టాక్‌మార్కెట్ 2-3 రోజుల పాటు క్షీణించడాన్ని ట్రెండ్‌గా భావించనక్కర్లేదన్నారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను పెంచే అంశంపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలో అత్యవసర ప్రణాళిక.. న్యూఢిల్లీ: వర్షాభావానికి సంబంధించి ప్రతి కూల ప్రభావాన్ని ఎదుర్కొనడానికి అత్యవసర ప్రణాళికను ప్రకటించనున్నట్లు ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. కరవు ఏర్పడే ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోవడంలో భాగంగా చేపట్టే కొన్ని పనులకు ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) నిధులను వినియోగించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. అత్యవరసర ప్రణాళిక కింద రూ.500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి వినియోగ ప్రతిపాదన ఉంది. తగిన ధరలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడం దీని ప్రధాన ధ్యేయం.