‘రక్షణ శాఖ’ భూములివ్వండి
స్కైవేల నిర్మాణానికి కంటోన్మెంట్ భూములు బదలాయించండి
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ని కోరిన మంత్రి కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: స్కైవేల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ అధీనంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని మంత్రి కేటీఆర్ కోరారు. ఢిల్లీలో ఆదివారం జైట్లీతో సమావేశమై కంటోన్మెంట్ ఏరియా మీదుగా స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్రానికి అందించాలని, భూమికి బదులుగా భూమి ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని కేటీఆర్ వివరించారు.
కేటీఆర్‌తో పాటుగా ఎంపీలు బి.వినోద్, జితేందర్ రెడ్డి, తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్నారు. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి కరీంనగర్ వరకూ నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారుల కూ కంటోన్మెంట్ భూములు అవసరమని కేటీఆర్ వివరించారు. ఎయిమ్స్ పనులు ప్రారంభించడానికి నిధులు కేటాయించాలని కోరారు.
ఎయిమ్స్ నిధుల అంశంతో పాటు కంటోన్మెంట్ ఏరియాలో రహదారుల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామ ని జైట్లీ హామీ ఇచ్చారని వినోద్ తెలిపారు. సోమవారం కేంద్ర మంత్రులు హర్‌సిమ్రత్ కౌర్, మనోజ్ సిన్హాతో కేటీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.