నేడు స్పైసెస్‌పార్కు ప్రారంభోత్సవం
♦ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
♦ ముఖ్యమంత్రి చంద్రబాబు,కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ రాక
చిలకలూరిపేట : భారత సుంగధద్రవ్యాల (స్పైసెస్) పార్కు సోమవారం ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు సర్వం పూర్తి అయ్యాయి. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ సీహెచ్ శ్రీధర్, రూరల్ ఎస్పీ కె నారాయణనాయక్, స్పైసెస్‌బోర్డు అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు ఆదివారం సాయంత్రానికి పూర్తి చేశారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పాలనా యంత్రాంగం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కావల్సిన అన్ని సదుపాయాలను కల్పించారు.
ముఖ్య అతిథులుగా..రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సభాపతి కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, జెడ్పీచైర్‌పర్సన్ షేక్ జానీమూన్, రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, వాణిజ్య విభాగం అడిషనల్ కార్యదర్శి రజని రంజన్ష్మ్రీ, సుగంధ ద్రవ్యాల చైర్మన్ డాక్టర్ జయతిలక్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే హాజరు కానున్నారు.
వీరితోపాటు మరో 2వేల వీఐపీలు రాన్నారు.
కార్యక్రమ వివరాలు....
ఉదయం 10.30 గంటలకు యడ్లపాడు మైదవోలు స్పైసెస్పార్కుకు సీఎం హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో పార్కు పరిపాలనా భవనం వద్దకు చేరుకుని పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం చిల్లి కామన్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఉద్యాన, వ్యవసాయ శాఖలు, సంప్రదాయ ఇంధన వనరులు శాఖ, స్పైసెస్పార్కుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన శిబిరాలను సందర్శిస్తారు.
ఆయా స్టాల్స్నందు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విధానం గురించి ప్రదర్శన ఇవ్వనున్నారు. చివరిగా వేదికపైకి చేరుకొని సాంస్కృతిక ప్రదర్శనలను తిలకిస్తారు. అనంతరం బహిరంగ సభ ప్రారంభం అవుతుంది. స్పైసెస్‌పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భద్రత కోసం అడిషనల్ ఎస్పీలు-2, డీఎస్పీలు-8, సీఐలు -12, ఎస్సైలు-48, కానిస్టేబుల్స్-545, మహిళా కానిస్టేబుల్స్-84, హోమ్‌గార్డులు-468, ఇతర జిల్లాల నుంచి వచ్చిన అదనపు సిబ్బంది-260 మందితోపాటు ఏఆర్ బలగాలను వినియోగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచే పార్కు ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పనుల పర్యవేక్షించిన కలెక్టర్...
జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రారంభోత్సవ పనులను ఆదివారం పరిశీలించారు. హెలిప్యాడ్, సభావేదిక, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్టాల్స్, పైలాన్ నిర్మాణం, తదితర అన్ని పనులను స్వయంగా పరిశీలించి ఆయా శాఖల అధికారులకు కార్యక్రమం చివరి వరకు ఇదే విధంగా సమన్వయంతో పనులు నిర్విహ ంచాలని ఆదేశించారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం సీఎం తిరిగి వెళ్లే వరకు ఎటువంటి అసౌర్యం లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగానికి పేరు తీసుకురావాలని కోరారు. స్పైసెస్‌పార్కు చైర్మన్ కన్నల్, మార్కెటింగ్ డిప్యూటీ డెరైక్టర్ సురేష్‌కుమార్, అడిషనల్ డెరైక్టర్ గిరీష్‌కుమార్ తదితరులతో ఏర్పాట్ల విషయంలో చర్చించారు.