రైతుల ఆత్మహత్యలకు మద్యం కారణమా?
♦ కేంద్ర మంత్రి రాధామోహన్‌పై ఎకల్ మహిళా కిసాన్ సంఘటన ఫైర్
♦ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పెన్షన్ రూ. 2000లకు పెంచాలని డిమాండ్
♦ సీఎం ఫడ్నవీస్‌కు వినతి పత్రం అందజేత
ముంబై : రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌పై రైతుల బంధువులు, మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలకు మద్యం కారణం కాదని, అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కారణమని ఎకల్ మహిళా కిసాన్ సంఘటన కన్వీనర్ బేబీతాయ్ వాఘ్ చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారం కారణమైతే మరి ధనిక ప్రజల గురించి ఏం చెబుతారని ప్రశ్నించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన, మద్యానికి బానిస అయిన రైతులను మహిళలు ప్రేమిస్తారా? అని ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలపై పార్లమెంటులో మంత్రి సమాధానమిస్తూ.. వరకట్నం, ప్రేమ వ్యవహారం, మద్యానికి బానిస అవడం లాంటి ఇతర కారణాలతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మంత్రి రాధామోహన్ వెల్లడించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. కాగా, ఆత్మహత్య చేసుకున్న రైతుల బంధువులకు పెన్షన్ పెంచాలంటూ సీఎం ఫడ్నవీస్‌కు మహిళా కిసాన్ సంఘటన వినతపత్రం సమర్పించింది. ప్రస్తుతం సంజయ్ గాంధీ నిరాధార్ యోజన ద్వారా రూ. 600 పెన్షన్ వస్తోందని, దీన్ని రూ. 2000లకు పెంచాలని సీఎంకు సంస్థ విన్నవించింది.
బాధిత కుటుంబాల్లోని మహిళలకు నిధులు అందించే విషయంలో నిబంధనలు సడ లించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లోని మహిళకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేసింది. ఆ కుటుంబాల్లోని చిన్నారులకు ఉన్నత విద్యకు ప్రభుత్వం సాయమందించాలని కోరింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లోని మహిళలను బీపీల్ జాబితాలో చేర్చాలని, ఆరోగ్య భీమా వర్తింపజేయాలని, సామాజిక భద్రత కల్పించాలని, ఇళ్ల పంపిణీ చేయాలని వినతి పత్రంలో కోరింది. డిమాండ్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారని సంఘటన కన్వీనర్ బేబీతాయ్ వాఘ్ తెలిపారు.