రిజర్వేషన్లు 75 శాతానికి పెంచాలి: కేంద్ర మంత్రి
- అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక కేటగిరీలో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
- జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి
- కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అత్వాలె
సాక్షి, హైదరాబాద్: దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 75 శాతానికి పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రాందాస్ అత్వాలె అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న అగ్రవర్ణాల్లోని వెనుకబడిన వర్గాలకు తమ పార్టీ(ఆర్పీఐ) మద్ధతు ఇస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన రాష్ట్ర ఎస్సీ కులాల అభివద్ధి శాఖ సంచాలకులు ఎం.వి.రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే జనాభా ప్రాతిపదికన సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు ఈ రిజర్వేషన్లు సరిపోవని అన్నారు.
దేశంలో 77 శాతం జనాభా ఉన్న వర్గాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం లెక్కన 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న కేంద్ర మంత్రి.. 23 శాతం మాత్రమే ఉన్న అగ్రవర్ణాల కోసం ఓపెన్ కేటగిరీలో 25 శాతం సరిపోతాయని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మహారాష్ట్రలోని మరాఠా, గుజరాత్‌లోని పటేల్, రాజస్థాన్‌లోని జాట్, రాజ్పుట్ తదితర వర్గాలకు ప్రత్యేక కేటగిరీలో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. రిజర్వేషన్లను 75 శాతానికి పెంచుతూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఓబీసీల్లో కలపాలనే డిమాండ్‌తో కాకుండా ప్రత్యేక కేటగిరీలో రిజర్వేషన్ల కోసం అగ్రవర్ణాల పేదలు పోరాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.
కేసీఆర్ మద్దతు కోరతాం
ఒకే భాష మాట్లాడే తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మరాఠి మాట్లాడే మహారాష్ట్ర ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. విదర్భను రాష్ట్రంగా ఏర్పాటు చేస్తేనే అభివద్ధి సాధ్యమవుతుందన్నారు. విదర్భ రాష్ట్రం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మద్ధతు కోరుతున్నట్లు చెప్పారు. విదర్భతో పాటు పూర్వాంచల్, హరితప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసంర ఉందని రాందాస్ అన్నారు. తెలంగాణలో దళితుల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కషిని కొనియాడారు. దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, కళ్యాణలక్ష్మి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ముదావహమన్నారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా పెద్దదైన 350 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముంబాయిలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
మహారాష్ట్రలోని విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని దశాబ్ధాలుగా ప్రజలు కోరుతున్నారని, ఈ డిమాండ్‌కు ఆర్పీఐతో పాటు బీజేపీ కూడా మద్ధతిచ్చాయని అన్నారు. నాగపూర్ రాజధానిగా మరాఠి మాట్లాడే వారు 1960 మే 1 కన్నా ముందు ప్రత్యేక రాష్ట్రంగానే ఉండేదని అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకోవాలన్నారు.