భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్
- కేంద్ర మంత్రి రాందాస్ సంచలన వ్యాఖ్యలు
వడోదరా: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్స్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సైందా? ఈ అనుమానం సగటు క్రీడాభిమానికి వస్తే చేసేదేమీలేదు కానీ సాక్షాత్తూ కేంద్ర మంత్రే ఫిక్సింగ్ అనుమానాలను వెలిబుచ్చితే? ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.
గత నెలలో(జూన్ 18న) జరిగిన ఐసీసీ చాంపియన్స్ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోరపరాజయంపాలైన తీరు తనను విస్మయానికి గురిచేసిందని, దీనిపై సమగ్రదర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి రాందాస్ అథావాలే అన్నారు. శుక్రవారం వడోదరా(గుజరాత్)లో పర్యటించిన మంత్రి రాందాస్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘భారత్ లాంటి బలమైన జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్(ఓవల్)లో బలహీనమైన పాకిస్తాన్‌ను 180 పరుగుల తేడాతో చిత్తుచేసింది. అయితే ఫైనల్స్‌లో మాత్రం ఇండియా 124 పరుగుల తేడాతో ఓడిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఇదెలా జరిగింది? మ్యాచ్ ఫిక్సైందా? దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీయాలి’ అని రాందాస్ వ్యాఖ్యానించారు.
టీమిండియాలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి
భారత జాతీయ క్రికెట్ జట్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన క్రీడాకారులకు రిజర్వేషన్ కల్పించాలని సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అభిప్రాయపడ్డారు. కనీసం 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఆయా వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరినట్లవుతుందన్నారు.