
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తుది అంకానికి చేరుకుంది. మొత్తం ఎనిమిది జట్లు భాగమైన ఈ వన్డే టోర్నమెంట్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) ఫైనల్‌కు చేరుకున్నాయి. టైటిల్ కోసం దుబాయ్ వేదికగా ఆదివారం ఇరుజట్లు తలపడనున్నాయి. కాగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్ భారత జట్టుపై మెరుగైన రికార్డు కలిగి ఉంది.
పాతికేళ్ల క్రితం అలా
2000లో చాంపియన్స్ ట్రోఫీ(నాడు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) తుదిపోరులో టీమిండియాపై గెలుపొంది న్యూజిలాండ్ టైటిల్ సాధించింది. అనంతరం 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో కోహ్లి సేనను ఓడించడంతో పాటు.. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్లోనూ టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ఎగురేసుకుపోయింది.
ఈ క్రమంలో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్ న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్ మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక తాజా చాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ గ్రూప్ దశలోనూ రోహిత్ సేనదే సాంట్నర్ బృందంపై పైచేయిగా ఉంది.
గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడ్డ ఈ రెండు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను ఓడించి సెమీస్ చేరుకున్నాయి. అయితే, గ్రూప్ దశలో ఆఖరిదైన మ్యాచ్‌లో మాత్రం టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి టాపర్‌గా నిలిచింది.
అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరగా.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి టీమిండియాతో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఇరుజట్ల మధ్య ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?
మరి ఒకవేళ సమవుజ్జీల మధ్య టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?.. సూపర్ ఓవర్లోనూ ఇద్దరూ సరిసమానంగా ఉంటే విజేతగా ఎవరిని నిర్ణయిస్తారు? అనే ప్రశ్నలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి.
మరి ఇందుకు సమాధానం ఏమిటంటే.. ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చడం పరిపాటే. అయితే, సూపర్ ఓవర్లోనూ రెండు జట్లు సమానంగా ఉంటే.. విజేత తేలేంత వరకూ సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు. 2019 వరల్డ్‌కప్ ఫైనల్ విన్నర్‌ను తేల్చిన విధానంపై విమర్శలు రాగా.. ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
అప్పట్లో వివాదం
నాడు ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ మ్యాచ్‌ను ‘టై’ చేసుకున్నాయి. అదే విధంగా సూపర్ ఓవర్లోనూ నువ్వా-నేనా అన్నట్లు తలపడి.. మళ్లీ ‘టై’ చేశాయి. దీంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ తీరుపై విమర్శలు రాగా.. ఇకపై ఐసీసీ టోర్నీల్లో ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే.. విజేత తేలేంత వరకు సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.
ఇక దుబాయ్‌లో వర్షం ముప్పులేదు. కానీ ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. 2002లో వరణుడి కారణంగా ఫైనల్ మ్యాచ్ సాగే వీలు లేకపోవడంతో భారత్- శ్రీలంకను టైటిల్ విజేతగా ప్రకటించారు. నిజానికి అప్పుడు రెండురోజుల్లో 110 ఓవర్ల ఆట పూర్తైనా.. ఆపై కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం?
Comments
Please login to add a commentAdd a comment