ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేత భారత్‌.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం | India Vs New Zealand ICC Champions Trophy 2025 Final Live Updates | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేత భారత్‌.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం

Published Sun, Mar 9 2025 1:42 PM | Last Updated on Sun, Mar 9 2025 10:00 PM

India Vs New Zealand ICC Champions Trophy 2025 Final Live Updates

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేత భారత్‌.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం

2025 ఎడిషన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా టీమిం​డియా అవతరించింది. దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలవడం ఇది మూడోసారి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో డారిల్‌ మిచెల్‌ (63), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్‌ యంగ్‌ 15, రచిన్‌ రవీంద్ర 37, కేన్‌ విలియమ్సన్‌ 11, టామ్‌ లాథమ్‌ 14, గ్లెన్‌ ఫిలిప్స్‌ 34, మిచెల్‌ సాంట్నర్‌ 8 పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు.

ఛేదనలో భారత్‌కు రోహిత్‌ శర్మ (76) శుభారంభం అందించారు. రోహిత్‌.. శుభ్‌మన్‌ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. అయితే భారత్‌ 17 పరుగుల వ్యవధిలో గిల్‌, కోహ్లి (1), రోహిత్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్‌ (48), అక్షర్‌ పటేల్‌ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. చివర్లో కేఎల్‌ రాహుల్‌ (34 నాటౌట్‌).. హార్దిక్‌ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్‌) కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సాంట్నర్‌, బ్రేస్‌వెల్‌ తలో 2.. జేమీసన్‌, రచిన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. అక్షర్‌ ఔట్‌
203 పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో రూర్కీకి క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పటేల్‌ (29) ఔటయ్యాడు. 44 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 212/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 36 బంతుల్లో 40 పరుగులు చేయాలి. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. శ్రేయస్‌ ఔట్‌
183 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. వేగంగా పరుగులు రాబట్టే క్రయంలో శ్రేయస్‌ అయ్యర్‌ (48) ఔటయ్యాడు. సా​ంట్నర్‌ బౌలింగ్‌లో రచిన్‌ క్యాచ్‌ పట్టడంతో శ్రేయస్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 68 బంతుల్లో 69 పరుగులు చేయాలి. 38.4 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 183/4గా ఉంది.

జాగ్రత్తగా ఆడుతున్న శ్రేయస్‌, అక్షర్‌
252 పరుగుల ఛేదనలో స్వల్ప వ్యవధిలో గిల్‌, విరాట్‌, రోహిత్‌ శర్మ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ (47), అక్షర్‌ పటేల్‌ (17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ భారత్‌ను విజయతీరాలవైపు తీసుకెళ్తున్నారు. 37 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 176/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 78 బంతుల్లో 76 పరుగులు చేయాలి. 

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రోహిత్‌ శర్మ ఔట్‌
252 పరుగుల ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం అనంతరం భారత్‌ 17 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో గిల్‌, కోహ్లి వికెట్లు కోల్పోయిన భారత్‌.. 122 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ (76) వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఆడిన రోహిత్‌.. పరుగులు అస్సలు రాకపోవడంతో ఒత్తిడికి లోనై భారీ షాట్‌కు ప్రయత్నించాడు. రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో క్రీజ్‌ దాటి చాలా ముందుకు వచ్చిన రోహిత్‌ బంతి కనెక్ట్‌ కాకపోవడంతో స్టంపౌటయ్యాడు. 

పరుగు వ్యవధిలో గిల్‌, కోహ్లి వికెట్లు కోల్పోయిన టీమిండియా
పరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద గిల్‌, 106 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యారు. అప్పటిదాకా గెలుపుపై ధీమా ఉన్న టీమిండియా ఒక్కసారిగా ఇద్దరు స్టార్ల వికెట్లు కోల్పోవడంతో డిఫెన్స్‌లో పడింది. గిల్‌ను సాంట్నర్‌.. కోహ్లిని బ్రేస్‌వెల్‌ ఔట్‌ చేశారు. గ్లెన్‌ ఫిలిప్స్‌ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్‌ పట్టడంతో గిల్‌ పెవిలియన్‌ బాట పట్టగా.. కోహ్లిని బ్రేస్‌వెల్‌ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. 

17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసిన టీమిండియా
252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసుకుంది. భారత్‌ వికెట్‌ నష్టపోకుండా ఈ మార్కును తాకింది. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని 68 పరుగులతో, గిల్‌ 27 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి. 

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ 
252 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్‌ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 65/0గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాలి.

టార్గెట్‌ 252.. ధాటిగా ఆడుతు‍న్న రోహిత్‌ శర్మ
252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్‌ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్‌ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్‌ 59/0గా ఉంది. 

మిచెల్‌, బ్రేస్‌వెల్‌ హాఫ్‌ సెంచరీలు.. టీమిండియా టార్గెట్‌ 252
ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి టీమిండియా ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌ (63), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అర్ద సెంచరీలు చేసి టీమిండియాకు ఫైటింగ్‌ టార్గెట్‌ను నిర్దేశించారు. 

భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 

విరాట్‌ కోహ్లి సూపర్‌ త్రో.. సాంట్నర్‌ రనౌట్‌
విరాట్‌ కోహ్లి సూపర్‌ త్రోతో మిచెల్‌ సాంట్నర్‌ను (8) రనౌట్‌ చేశాడు. 239 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది.

ఆరో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
45.4వ ఓవర్‌: 211 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో డారిల్‌ మిచెల్‌ (63) ఔటయ్యాడు. ఔట్‌ కాకముందు మిచెల్‌ షమీ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాడు.

డేంజరెస్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఔట్‌
37.5వ ఓవర్‌: డేంజరెస్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఔటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఫిలిప్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 38 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 165/5గా ఉంది. డారిల్‌ మిచెల్‌కు (44) జతగా బ్రేస్‌వెల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

నిలకడగా ఆడుతున్న మిచెల్‌, ఫిలిప్స్‌
లాథమ్‌ వికెట్‌ పడ్డ తర్వాత న్యూజిలాండ్‌ మరో వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. డారిల్‌ మిచెల్‌ (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (28) నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 156/4గా ఉంది. 

కివీస్‌ నాలుగో వికెట్‌ డౌన్‌..
టామ్‌ లాథమ్‌ రూపంలో న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన లాథమ్‌ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్లెన్‌ ఫిలిప్స్‌ వచ్చాడు. 26 ఓవర్లకు న్యూజిలాం‍డ్‌ స్కోర్‌: 116/4

నిలకడగా ఆడుతున్న మిచెల్‌, లాథమ్‌..
22 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మిచెల్‌(18), టామ్‌ లాథమ్‌(14) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

విలియమ్సన్‌ ఔట్‌..
కేన్‌ విలియమ్సన్‌ రూపంలో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన విలియమ్సన్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి టామ్‌ లాథమ్‌ వచ్చాడు. 15 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 82-3

కివీస్‌ స్పిన్‌​ మ్యాజిక్‌.. రవీంద్ర క్లీన్‌ బౌల్డ్‌
రచిన్‌ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రవీం‍ద్ర.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్‌ వచ్చాడు. 11 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 73/3

వరుణ్‌​ మ్యాజిక్‌.. కివీస్‌ తొలి వికెట్‌​ డౌన్‌
న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన విల్‌ యంగ్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కేన్‌ విలియమ్సన్‌ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 58 పరుగులు చేసింది. రవీంద్ర 34 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

దూకుడుగా ఆడుతున్న రచిన్‌..
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రచిన్‌ రవీంద్ర(16), విల్‌ యంగ్‌(8) ఉన్నారు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌కు తెర‌లేచింది. దుబాయ్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గుతున్న ఈ టైటిల్‌ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కివీస్‌ స్టార్‌ పేసర్‌ మాట్‌ హెన్రీ దూరమయ్యాడు. అతడి స్ధానంలో నాథన్‌ స్మిత్‌ తుది జట్టులోకి వచ్చాడు. భారత్‌ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.

తుది జ‌ట్లు
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్

భార‌త్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

మరి కాసేపటిలో టాస్‌..
ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో టాస్‌ పడనుంది. ఇరు జట్లకు టాస్‌ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్లు తమ ఆస్తశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి.

హెడ్ ​​టు హెడ్ రికార్డ్..
ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్లు ముఖాముఖి 119 వ‌న్డేల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 61 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మ‌రో 7 మ్యాచ్‌ల్లో ఫ‌లితం తేల‌క‌పోగా.. ఓ మ్యాచ్ టై అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement