ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే నివేదిక
న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ అంశంపై త్వరలోనే నివేదిక రూపొందించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించనున్నట్టు కేంద్ర సామాజిక న్యాయమంత్రి తావర్ చంద్ గెహ్లాట్ సోమవారం కేంద్ర సమాచార మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధం సభ వివరాలను తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించారు.
ఇరవై మూడేళ్లుగా జరుగుతున్న ఎస్సీల ఉద్యమాన్ని సామాజిక న్యాయమంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు వివరించి చట్టపరమైన, రాజకీయపరమైన నిబంధనలకు లోబడి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన గెహ్లాట్ ఈ అంశంపై నివేదిక తయారు చేసి ప్రధాని, పార్టీ అధ్యక్షుడితో చర్చిస్తానని తెలిపారు. వెంకయ్యనాయుడు పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలకు కూడా ఇదే విషయాన్ని వివరించారు.