మనవారేనని వదిలేస్తారా..!
సాక్షి, సిటీబ్యూరో: వంద రూపాయలు బకాయి పడితే సామాన్యుడికి షాకిస్తున్న సీపీడీసీఎల్... పెద్దల బకాయిలపై నోరు మెదపడంలేదు. బడా వ్యక్తులు, ఉద్యోగ సంఘాల బకాయిలు లక్షల్లో పేరుకుపోయినా మిన్నకుడం గమనార్హం. సీపీడీసీఎల్‌కు చెందిన ఉద్యోగ సంఘాల్లో ఒక్కో సంఘం చెల్లించాల్సిన బకాయి లు రూ.లక్షకు పైగా ఉందంటే అతిశయోక్తి కాదు. వీరిని వదిలేసి అల్పాదాయ వర్గాలపై ప్రతాపం చూపుతున్న విద్యుత్‌శాఖ వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సామాన్యుల పైనే ప్రతాపం
ఎలక్ట్రిసిటీ రెవెన్యూ చట్టం ప్రకారం విద్యుత్‌ను వినియోగిస్తున్న వారెవరైనా సంస్థకు బిల్లు చెల్లించాల్సిందే. కానీ ఈ బిల్లు వసూళ్లలో అధికారులు మాత్రం స్థానిబట్టి వివక్ష చూపుతున్నారు. సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారుడి విద్యుత్ కనెక్షన్ తొలగించే అధికారం ఉన్నా, అధికారులు మాత్రం ఈ చట్టాన్ని నిరుపేదలకే వర్తింపజేసి కనెక్షన్లు తొలగించడంతో పాటు వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాలు, పార్టీ ఆఫీసులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, ఏళ్లకు యేళ్లుగా కరెంట్ బిల్లు కట్టకపోయినా పట్టించుకోని డిస్కం నెలసరి బిల్లుల పేరుతో సామాన్యులను ముప్పుతిప్పలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బడా బకాయిదారులందరికీ విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు రికార్డుల్లో చూపుతున్నా..ఆయా వ్యక్తుల ఇళ్లల్లో మాత్రం వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాయి.
ఇంటి దొంగలను పట్టించుకోని సీఎండీ
బిల్లు కట్టలేదనే నెపంతో వారం రోజుల క్రితం గోల్కొండకోటకు విద్యుత్ సరఫరా నిలిపివేయగా, రెండు నెలలుగా బిల్లు చెల్లించడ ం లేదంటూ ఈనెల 26న బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయానికి సరఫరా నిలిపివేసింది. రెండు రోజుల క్రితం బిల్లు చెల్లించలేదని బేగంబజార్‌లోని ఓ వస్త్రవ్యాపారికి సంబంధించిన కనెక్షన్ కట్ చేయడంతో వ్యాపారులంతా ఆందోళనకు దిగిన విష యం విధితమే.
తాజాగా శనివారం టోలీచౌకీ బల్దియా వార్డు కార్యాలయానికి విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సామాన్యులు, ప్రభుత్వ కార్యాలయాల క నెక్షన్లు కట్ చేస్తున్న సీపీడీసీఎల్ సీఎండీ తమ ఇంటి దొంగలను మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాభై రూపాయలు బకాయి పడినా కనెక్షన్ తొలగిస్తామని చెప్పే అధికారులు లక్షల్లో బకాయి పడినవాని ఏ విధంగా వదిలేస్తున్నారో వారికే తెలియాలి.