నెల రోజుల పాటు ముమ్మరంగా సమైక్య ఉద్యమం: అంబటి రాంబాబు
నెల రోజుల పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 వరకూ ఉద్యమ కార్యాచరణను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం ప్రకటించారు. అక్టోబర్ 1న గుంటూరు నుంచి విజయవాడ వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తారని, అక్టోబర్ 2 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు సహా పార్టీ శ్రేణుల నిరవధిక, రిలే నిరాహారదీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు. అలాగే అక్టోబర్ 7న కాంగ్రెస్, టీడీపీ నేతల నివాసాల వద్ద ధర్నాలు చేస్తారని, అక్టోబర్ 10న మండల కేంద్రాల్లో రైతులతో దీక్ష నిర్వహిస్తారని అన్నారు.
అక్టోబర్ 17న నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీ చేస్తారు. 21న నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. 24న నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 26న సర్పంచ్‌లు, సర్పంచ్‌గా పోటీచేసిన అభ్యర్థులు కలిసి జిల్లా కేంద్రాల్లో ఒకరోజు దీక్ష చేస్తారు. అక్టోబర్ 29న నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. నవంబర్ 1న అన్ని పంచాయతీల్లో గ్రామసభలు, సమైక్యాంధ్ర కోరుతూ తీర్మానాలు చేయనున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు.