వామపక్షాలు సంఘటితం కావాలి
దోమలగూడ: వామపక్షాల మధ్య సైద్దాంతిక విభేధాలు ఉన్నప్పటికీ అంగీకరించిన అంశంపై ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ కమ్యూనిస్టు, వామపక్షాల ఐక్యతకు సీపీఎం కృషి చేస్తుందని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గురువారం చిక్కడపల్లిలోని హోటల్ సాయికృపలో ఎంసీపీఐ (యు) 3 వ అఖిల భారత మహాసభల్లో భాగంగా మూడవ రోజు కమ్యూనిస్టుల ఐక్యతపై సదస్సు నిర్వహించారు. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి గౌస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ (యు) జాతీయ ప్రధానకార్యదర్శి కుల్దీప్సింగ్, పోలిట్బ్యూరో సభ్యులు రాజన్, ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సిపిఐఎంఎల్ కమిటీ సభ్యులు కొల్లిపర వెంకటేశ్వర్రావు, ఎస్యూసిఐ నాయకులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వామపక్షాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్షాల్లో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని అనుకున్న స్థాయిలో ప్రతిఘటించలేక పోతున్నామని, ప్రపంచ వ్యాప్తంగా యువత వామపక్ష ఆలోచనా విధానం, అభ్యుదయ భావాలకు ఆక ర్షితులు కాలేకపోతున్నారన్నారు. పాలక వర్గాలు పెట్టుబడిదారి వర్గాల కొమ్ముకాస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు.
ఈ పరిస్థితుల్లో నైతిక విలువలు కలిగిన కమ్యూనిస్టు, వామపక్షాలు ఏకమై ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నారు. గౌస్ మాట్లాడుతూ దేశంలో బూర్జువా పార్టీలు ఒకరి బలహీనతలను మరొకరు సొమ్ము చేసుకుంటూ అధికారాన్ని సాధించుకుంటున్నారన్నారు. వామపక్షాలు ఐక్యంగా ఉంటేనే వారిని ఎదుర్కోవడం సాధ్యపడుతుందన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలు వామపక్షాల ఐక్యత తప్పనిసరిగా మారిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపి కిషన్, ఎం వెంకట్రెడ్డి, మద్దికాయల అశోక్ తదితరులు పాల్గొన్నారు.