ఎస్టీ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి
యూఎస్ ఎయిడ్, మెకెన్సీ కంపెనీల సహకారంతో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంథాను అనుసరిస్తోంది. అంతర్జాతీయ సంస్థల సహకారంతో శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలకు అవకాశం కల్పించి, ఉపాధి పొంది సొంతంగా నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా యునెటైడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ (యూఎస్ ఎయిడ్), మెకెన్సీ అండ్ కంపెనీల సహకారంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వైద్య సేవారంగంలో ఎస్టీ యువతకు శిక్షణ, యునెటైడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) సహకారంతో గిరిజన ప్రాంతాల్లో ఔత్సాహిక పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటునకు చర్యలు చేపట్టింది. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తీసుకున్న చొరవతో ప్రతిష్టాత్మకమైన సంస్థల సహకారంతో ఆయా రంగాల్లో శిక్షణను అందించనున్నారు.
వైద్య సేవారంగంలో...
మెకెన్సీ అండ్ కంపెనీ, యూఎస్ ఎయిడ్ సహకారంతో వైద్య రంగంలో పేషెంట్ కేర్ అసిస్టెంట్ (పీసీఏ), జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (జీడీఏ)లుగా ఎస్టీ యువతకు వృత్తిపరమైన శిక్షణనివ్వనున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని మాక్స్‌క్యూర్, కిమ్స్, ఎన్టీఆర్ కేన్సర్ ఆసుపత్రి, స్టార్ ఆసుపత్రి తదితరాల్లో నెలకు రూ.7,300-రూ.9,300 జీతం లభించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ.. శిక్షణ పొందేవారిని ఎంపికచేసి, వారికి అవసరమైన మెటీరియల్, శిక్షణ తరగతుల నిర్వహణ, పర్యవేక్షణ తదితరాలను చేపట్టనుంది. ఎస్టీ సంక్షేమ శాఖ శిక్షణ తరగతుల నిర్వహణకు సహకారం అందించనుంది.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ
యూఎన్డీపీతో రాష్ట్రప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణ అందించనుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ముందుగా భ ద్రాచలం (ఖమ్మం జిల్లా), ఏటూరునాగారం (వరంగల్ జిల్లా), ఉట్నూరు (ఆదిలాబాద్ జిల్లా), హైదరాబాద్‌లలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్స్(ఈడీసీ)లను ఏర్పాటుచేసి, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను వివరించి, శిక్షణ ఇవ్వనున్నారు. 2016-17లో కనీసం వెయ్యిమందికి శిక్షణనిచ్చి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎస్టీ శాఖ ప్రణాళికలు రూపొందించింది.