Manipur violence: మణిపూర్‌లో ఉద్రిక్తతలకు అవే కారణం
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో కొన్నేళ్లుగా నిద్రాణంగా ఉన్న ఉగ్రవాదుల ముఠాలు ప్రజల నిరసనల నేపథ్యంలో మళ్లీ చురుగ్గా మారాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల ఓ సైనికా« దికారిపై కాల్పులు జరిపి, తీవ్రంగా గాయపరిచిన ఘటనను వారు ఉదహరిస్తున్నారు. నిషేధిత యునై టెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూ ఎన్ఎ ల్‌ఎఫ్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉగ్రవాదులు దీని వెనుక ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.
మణిపూ ర్లో నిరసనలకు దిగుతున్న పౌరులతో కలిసిపోయి ఉద్రిక్తతలు పెంచుతున్నారని చెబుతున్నారు. గత వారం టెంగ్నౌపల్ జిల్లా మొల్నోయి గ్రామంలో గిరిజనులపై దాడికి యత్నించిన కొందరు ఆందోళన కారులను అస్సాం రైఫిల్స్, ఆర్మీ బలగాలు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్ రమణ్ త్యాగి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గువాహటిలో చికిత్స పొందుతున్నారు.
ఆందోళనకారుల్లో కొందరు నిషేధిత గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు అనంతరం చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందని అధికారులు వివరించారు. యూఎన్ఎల్ఎఫ్, పీఎల్ఏతోపాటు కంగ్లీ యవోల్ కన్బా లుప్(కేవైకేఎల్), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్ఈపీఏకే) లు కూడా రాష్ట్రంలో యాక్టివ్‌గా అయ్యాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. యూఎన్ఎల్ఎఫ్కు 330, పీఎల్ఏకు 300, కేవైకేఎల్ 25 మంది కేడర్ కలిగి ఉన్నాయన్నారు.
కేవైకేఎల్ చీఫ్ టాంబా అలియాస్ ఉత్తమ్ సహా ఆ గ్రూప్‌లోని 12 మంది జూన్‌లో పట్టుబడ్డారన్నారు. ఈ గ్రూపులన్నిటికీ ఆర్మీపై దాడులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్ రవాణా, స్మగ్లింగ్ వంటి ఘటనలకు పాల్పడిన చరిత్ర ఉందని వివరించారు. మణిపూర్‌లో అల్లర్లు మొదలైనప్పటినుంచి పోలీస్ స్టేషన్ల నుంచి ఎత్తుకెళ్లిన మెషిన్ గన్స్, రైఫిళ్లు వంటి 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల వరకు బుల్లెట్లు వీరి వద్దే ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మే నుంచి తెగల మధ్య కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.