అమెరికా ‘ఇంటిదొంగ’
అంతర్జాతీయ ఉగ్రవాదం మీద ప్రకటించిన యుద్ధంలో పాకిస్థాన్‌ను తన కుడిభుజంగా అమెరికా ‘భావిస్తోంది’. ఆ కుడిభుజం తాజా నిర్వాకమే ఇప్పుడు అమెరికాను కలవరపెడుతోంది. అమెరికా విదేశ వ్యవహారాల శాఖలో ఒక ఇంటిదొంగ తమ కోసం పని చేస్తున్నట్టు పాకిస్థాన్ అధికారి ఒకరు నోరు జారారు. ఈ అంశమే ఇప్పుడు అగ్రదేశాన్ని కలవరపెడుతోంది. ఆ ఇంటిదొంగ పేరు రాబిన్ ఎల్. రాఫెల్. 67 ఏళ్ల ఈ మహిళా దౌత్య నిపుణురాలి మీద గత నెల నుంచి అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ కన్ను వేసి ఉంచింది. కిందటి నెలలో ఇంటిని సోదా చేసి, కొంత సమాచారాన్ని కనుగొన్నారు. ఆమె కార్యాలయానికి సీలు కూడా వేశారు. కానీ రాఫెల్‌ను ఎఫ్‌బీఐ ప్రశ్నించలేదని ఆమె కార్యదర్శి ప్రకటించడం విశేషం.
అలాగే, రాఫెల్ పాకిస్థాన్ మిత్రురాలు కాబట్టే ఎఫ్‌బీఐ ప్రశ్నిం చిందని అనుకోవడం సరికాదని పాకి స్థాన్ దౌత్యవేత్త తస్నీమ్ అస్లాం ప్రకటించడం ఈ వివా దంలో మరో కోణం. ఇది అమె రికా అంతర్గత వ్యవహారమని అంటూనే, రాఫెల్ పాక్ చిర కాల మిత్రురాలని తస్నీమ్ చెప్పక చెప్పారు. కానీ, గూఢ చర్యం వంటి కీలక ఆరోపణల గురించిన దర్యాప్తులో ఎఫ్‌బీఐ సాధారణంగా సమాచారాన్ని బయటకు పొక్కనీయదు. అందుకు భిన్నంగా ఇప్పుడు జరుగుతోంది.
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌ను రహస్యంగా విన్నపుడు ఈ వివాదం బయటపడింది. అమెరికా దేశ రహస్యాలు అందించే ఒక అధికారి ఉన్నారని అందులో మాట్లాడిన పాక్ అధికారి చెప్పాడు. దీనితో కొన్ని నెలలు నిఘా వేసి, ఇంటిదొంగను పట్టుకున్నారు. రాఫెల్ తన కార్యాలయం నుంచి కొంత సమాచారం ఇంటికి తీసుకువెళ్లినట్టు తేలింది. అయితే పాకిస్థాన్ ఫోన్ కాల్ ఆధారంగానే ఇదంతా చేస్తున్నారా అన్నది తేలడం లేదు. ఆమెపై ఇప్పటికీ నేరారోపణ పత్రం ఏదీ దాఖలు కాలేదు. కానీ గత నెలలోనే రాఫెల్ అధికారాలను పూర్తిగా తొలగించారు.
ఆమె పదవీ కాలం నవంబర్ రెండుతో ముగిసిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
అమెరికా దౌత్య వ్యవహారాలలో నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన రాఫెల్ ఆ దేశ మహిళా దౌత్యవేత్తలలో ప్రముఖురాలు. బిల్ క్లింటన్ హయాం లో కీలకంగా పనిచేశారు. ట్యునీషియాలో అమెరికా రాయబారిగా పనిచేయ డంతో పాటు, దక్షిణ ఆసియా వ్యవహారాల శాఖకు సహాయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ముఖ్యంగా పాకిస్థాన్ సంబంధాలలో లోతైన అధ్యయనం చేసినవారు.
2005లో పదవీ విరమణ చేసిన తరువాత మళ్లీ అదే శాఖలో చేరి, పాకిస్థానీ లాబీకి దగ్గరయ్యారు. ఈ నెల ఆరంభం వరకు రాఫెల్ పాక్ పౌర వ్యవహారాలలో అమెరికాకు సలహాదారుగానే ఉన్నారు. పాకిస్థాన్‌కు అమెరికా ఇచ్చిన 7.5 బిలియన్ డాలర్ల సైనికేతర నిధుల నిర్వహణలో ఆమెదే కీలక పాత్ర. పాకిస్థాన్‌ను కేంద్రంగా మార్చుకుని అఫ్ఘానిస్థాన్ భూమి మీద సోవి యెట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అమెరికా జరిపిన పోరాటం సమయంలో ఒక దౌత్య నిపుణుల బృందం అమెరికాలో వృద్ధిలోకి వచ్చింది. అందులో ఒకరు రాఫెల్. 1975 నుంచి పాకిస్థాన్‌తో ఆమె అనుబంధం కొనసాగుతోంది. తనకు ఇండియా కంటె పాకిస్థాన్ బాగా అర్థమైందని ఆమె చెప్పేవారు.
ఒకటి వాస్తవం. రాఫెల్ మీద ఆరోపణలను నమ్ముతున్నవారు, వ్యతి రేకిస్తున్నవారు కూడా ఉన్నారు. ఆమెను ‘పక్షి’ అని వ్యంగ్యంగా పిలిచే వ్యతిరేక వర్గం బలంగానే ఉంది. అఫ్ఘాన్ యుద్ధంలో వేయి మంది సైనికులు చని పోవడానికి కారణమైన పాకిస్థాన్‌ను సమర్థించే అధికారిగా ఆమెను ఈసడించే వారు తక్కువేమీ కాదు. తాలిబన్‌ను శాంతి చర్చలకు తీసుకురావాలని పాకి స్థాన్‌ను ఒప్పించవచ్చునని భావించి విఫలమైన వ్యక్తిగా కూడా ఆమెను సైనికాధికారులు పరిగణిస్తారు. ఈ యుద్ధంలో 2,350 మంది సైనికులను అమెరికా కోల్పోయింది. రాఫెల్ మాజీ భర్త ఆర్నాల్డ్ ఎల్ రాఫెల్ 1988లో పాకిస్థాన్‌లో రాయబారి. ఆ సమయంలో జరిగిన విమాన ప్రమాదంలోనే పాకిస్థాన్ అధ్యక్షుడు, సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్ మరణించాడు. విమానం కూల్చివేత పెద్ద కుట్ర అన్న వాదన ఉంది. ఇప్పటికీ చిక్కుముడిగా ఉన్న ఆ విమాన ప్రమాదంలోనే ఆర్నాల్డ్ కూడా మరణించారు.