University of Leeds
-
Benjamin J W Mills: ఆక్సిజన్ ‘స్థాయి’లో మార్పును బట్టి గ్రహాలపై జీవం గుట్టు పట్టేయొచ్చు
లీడ్స్(యూకే): అనంతమైన విశ్వంలో మనమంతా ఒంటరి జీవులమా? లేక ఇతర గ్రహాలపైనా జీవం ఏదైనా ఉందా? మన సౌర కుటుంబానికి అవతల ఉన్న గ్రహాలపై వాతావరణం ఉనికి ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు శతాబ్దాలుగా మానవులను వేధిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధాలు కనిపెట్టేందుకు జిజ్ఞాసులు అలుపెరుగని కృషి సాగిస్తున్నారు. ఇతర గ్రహాలపై జీవం జాడ తెలుసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. రహస్యాన్ని ఛేదించే విషయంలో మనం కొంత పురోగతి సాధించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు తెలిసింతవరకూ కేవలం మన భూగోళంపైనే జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్‌ను శ్వాసిస్తున్నాయి. జీవుల మనుగడకు ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరమన్న సంగతి తెలిసిందే. భూమిపై ఆక్సిజన్ ఎల్లవేళలా ఒకేలా లేదని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన బయోకెమికల్ మోడలింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ బెంజమిన్ జేడబ్ల్యూ మిల్స్ చెప్పారు. కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఆక్సిజన్ పరిమాణం మారుతూ వచ్చిందని అన్నారు. ఈ మార్పు ఎప్పుడు, ఎలా జరిగిందో, ఆయా సమయాల్లో ఏయే జీవులు పుట్టాయో కచ్చితంగా తెలుసుకుంటే ఇతర గ్రహాలపై ఉన్న వాయువుల పరిమాణం గురించి, తద్వారా అక్కడి జీవజాలం గురించి ఒక అంచనాకు రావొచ్చని వివరించారు. మన గ్రహంపై ఉన్న ఆక్సిజన్ పరిమాణంపై తమ పరిశోధనలో కీలక విషయాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. భూమిపై ఆక్సిజన్, జీవం భూగోళంపై వాతావరణంలో ప్రస్తుతం 21 శాతం ఆక్సిజన్ ఉంది. అయితే, ఇప్పుడున్నంత ఆక్సిజన్ కోట్ల సంవత్సరాల క్రితం లేదు. గతంలోకి.. అంటే 45 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. అక్కడ జీవించడానికి ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా వెంట తీసుకొని పోవాల్సిందే. ఎందకంటే అప్పట్లో స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ ఉండేది. జీవులు కూడా ఇంకా పుట్టలేదు. ప్రధానంగా మూడు దశల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై పెరిగాయి. మొదటిది ‘గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్’. దాదాపు 240 కోట్ల సంవత్సరాల క్రితం ఇది సంభవించింది. భూమిపై వాతావరణం ఏర్పడింది. ఆక్సిజన్ నిల్వలు ప్రారంభమయ్యాయి. రెండోది నియోప్రొటెరోజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్ (ఎన్ఓఈ). 80 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించింది. భూమిపై ఆక్సిజన్ పరిమాణం పెరిగింది. దాదాపు ఇప్పుడున్న స్థాయికి ప్రాణవాయువు చేరుకుంది. ఆ తర్వాత 20 కోట్ల సంత్సరాలకు భూమిపై తొలితరం జంతువులు పుట్టాయి. మూడోది ‘పాలెజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్’.. 42 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. ఆక్సిజన్ ఇప్పుడున్న స్థాయికి పూర్తిగా చేరింది. 75 కోట్ల ఏళ్ల క్రితం భూమి వాతావరణంలో కేవలం 12 శాతం ఆక్సిజన్ ఉండేది. ఇది ఇప్పుడు 21 శాతానికి ఎగబాకింది. ఆక్సిజన్ పరిమాణాన్ని బట్టి కొత్త జీవులు ఉద్భవించడం, పాతవి అంతరించిపోవడం వంటివి జరిగాయని పరిశోధకులు భావిస్తున్నారు. దాదాపు 45 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మొక్కలు పుట్టాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(సీఎస్ఏ) భాగస్వామ్యంతో గత ఏడాది జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్‌టీ)ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది మన సౌర మండలం ఆవల ఉన్న గ్రహాలపై వాతావరణం, వాయువులపై అధ్యయనం చేస్తోంది. అక్కడి వాయువులు, వాటి పరిమాణం గురించి తెలిస్తే జీవం ఉందా? లేదా? అనేది తేల్చవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. -
ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్ యూనివర్సిటీ హెచ్చరిక
లండన్: పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు (గ్లేసియర్లు) ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది. భూతాపం అనూహ్యంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని, దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్ధకం కానుందని తెలిపింది. లండన్‌కు చెందిన ఈయూనివర్సిటీ నివేదిక జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. 400–700 సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్ ఎక్స్పాన్షన్ సమయం (లిటిల్ ఐస్ ఏజ్)తో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్ గ్లేసియర్స్‌లో మంచు పదింతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కుంచించుకుపోతున్నట్లు హెచ్చరించింది. హిమాలయాల్లోని 14,798 గ్లేసియర్లు లిటిల్ ఐస్ ఏజ్ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక మదింపు చేసింది. అప్పట్లో ఇవి 28 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండగా, ప్రస్తుతం 19,600 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని, అంటే దాదాపు 40 శాతం మేర కుచించుకుపోయాయని తెలిపింది. ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు 0.92– 1.38 మీటర్ల చొప్పున పెరిగాయని, ప్రస్తుత మంచు కరుగుదల అంతకు పదింతలు అధికంగా ఉందని నివేదిక రచయిత జొనాధన్ కార్విక్ చెప్పారు. మానవ ప్రేరిత శీతోష్ణస్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందన్నారు. మూడో అతిపెద్ద గ్లేసియర్ సముదాయం అంటార్కిటికా, ఆర్కిటికా తర్వాత హిమాలయాల్లోని గ్లేసియర్లలో మంచు అధికం. అందుకే హిమాలయాలను థర్డ్ పోల్ (మూడో ధృవం)గా పిలువడం కద్దు. ఆసియాలోని అనేక దేశాల జనాభాకు అవసరమైన పలు నదులకు ఈ హిమానీ నదాలు జన్మస్థానం. వీటి క్షీణత కోట్లాది మందిపై పెను ప్రభావం చూపుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మపుత్ర, గంగ, సింధుతో పాటు పలు చిన్నా పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానం. గతకాలంలో మంచు కరుగుదల, గ్లేసియర్ల విస్తీర్ణం మదింపునకు పరిశోధక బృందం శాటిలైట్ చిత్రాలను, డిజిటల్ సాంకేతికతను ఉపయోగించింది. గతంలో గ్లేసియర్లు ఏర్పరిచిన హద్దులను శాటిలైట్ చిత్రాల ద్వారా కనుగొని, ప్రస్తుత హద్దులతో పోల్చడం ద్వారా వీటి క్షీణతను లెక్కించారు. హిమాలయాల తూర్పు ప్రాంతంలో గ్లేసియర్ల క్షీణత వేగంగా ఉంది. హిమానీ నదాలు సరస్సుల్లో కలిసే ప్రాం తాల్లో వీటి క్షీణత అధికంగా ఉంది. ఇలాంటి సరస్సుల సంఖ్య, విస్తీర్ణం పెరగడమనేది గ్లేసియర్లు కుంచించుకుపోతున్నాయనేందుకు నిదర్శనమని తెలిపింది. మానవ ప్రేరిత ఉష్ణోగ్రతా మార్పులను అడ్డుకునేందుకు తక్షణ యత్నాలు ఆరంభించాలని నివేదిక పిలుపునిచ్చింది. -
అతి శక్తిమంతమైన లేజర్ చిప్ ఆవిష్కరణ
లండన్: ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన టెరాహెర్జ్ లేజర్ చిప్‌ను బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ చిప్ నుంచి ఒక వాట్‌కు మించిన శక్తి వెలువడుతుందట. పరారుణ కాంతి (ఇన్ఫ్రారెడ్), సూక్ష్మ తరంగాలకు మధ్య తరంగదైర్ఘ్యం కలిగిన లేజర్ కిరణాలను ఉత్పత్తి చేసే చిప్‌లను టెరాహెర్జ్ చిప్‌లుగా పిలుస్తారు. ఈ చిప్‌ల నుంచి వెలువడే శక్తిమంతమైన లేజర్లను భద్రతాపరమైన తనిఖీలకు, పేలుడు పదార్థాలను, రసాయనాలను గుర్తించేందుకు, కేన్సర్ వంటి వ్యాధులను నిర్ధారించేందుకు, ఔషధ రంగం, టెలి కమ్యూనికేషన్స్‌లో కూడా ఉపయోగిస్తారు. అయితే వీటి శక్తిని పెంచడంతోపాటు ఉపయోగించేందుకు అనువైన రీతిలో చాలా దగ్గరగా కేంద్రీకృతం చేయడమే అత్యంత కీలకం. టెరాహెర్జ్ చిప్‌లతోనే ఇలాంటి లేజర్లను చవకగా ఉత్పత్తి చేయడం వీలవుతుంది కాబట్టి వీటికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇంతకుముందు మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, గతేడాది వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు కూడా అతి శక్తిమంతమైన టెరాహెర్జ్ లేజర్ చిప్‌లను తయారు చేసినా.. వాటి శక్తి 0.47 వాట్‌కు మించలేదు.