అతి శక్తిమంతమైన లేజర్ చిప్ ఆవిష్కరణ
లండన్: ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన టెరాహెర్జ్ లేజర్ చిప్‌ను బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ చిప్ నుంచి ఒక వాట్‌కు మించిన శక్తి వెలువడుతుందట. పరారుణ కాంతి (ఇన్‌ఫ్రారెడ్), సూక్ష్మ తరంగాలకు మధ్య తరంగదైర్ఘ్యం కలిగిన లేజర్ కిరణాలను ఉత్పత్తి చేసే చిప్‌లను టెరాహెర్జ్ చిప్‌లుగా పిలుస్తారు. ఈ చిప్‌ల నుంచి వెలువడే శక్తిమంతమైన లేజర్‌లను భద్రతాపరమైన తనిఖీలకు, పేలుడు పదార్థాలను, రసాయనాలను గుర్తించేందుకు, కేన్సర్ వంటి వ్యాధులను నిర్ధారించేందుకు, ఔషధ రంగం, టెలి కమ్యూనికేషన్స్‌లో కూడా ఉపయోగిస్తారు.
అయితే వీటి శక్తిని పెంచడంతోపాటు ఉపయోగించేందుకు అనువైన రీతిలో చాలా దగ్గరగా కేంద్రీకృతం చేయడమే అత్యంత కీలకం. టెరాహెర్జ్ చిప్‌లతోనే ఇలాంటి లేజర్‌లను చవకగా ఉత్పత్తి చేయడం వీలవుతుంది కాబట్టి వీటికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇంతకుముందు మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, గతేడాది వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు కూడా అతి శక్తిమంతమైన టెరాహెర్జ్ లేజర్ చిప్‌లను తయారు చేసినా.. వాటి శక్తి 0.47 వాట్‌కు మించలేదు.