unnown
-
యువకుడి దుర్మరణం
చాగల్లు: చాగల్లు మండలం ఎస్.ముప్పవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కలవలపల్లి గ్రామానికి చెందిన జానా రాముడు (22) తన స్నేహితుడు జొన్న వెంకటేశ్వరరావుతో కలిసి బైక్‌పై నిడదవోలు వెళ్లారు. అక్కడి నుంచి ఊనగట్ల వెళుతుండగా మార్గమధ్యంలో గురువారం రాత్రి సమయంలో ఎస్.ముప్పవరం గ్రామ శివారు మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న రాముడు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వరరావు కాలు, చేయికి గాయాలయ్యాయి. చాగల్లు ఏఎస్సై ఎం.ధనరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల ఆందోళన మృతుడి బంధువులు నిడదవోలు–పంగిడి రహదారిపై ఆందోళనకు దిగారు. శుక్రవారం వేకువజాము వరకు ఆందోళన సాగింది. మాజీ సర్పంచ్ కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ రోడ్డులో క్వారీ లారీలు మితివీురిన వేగంతో వెళుతూ ప్రాణాలను హరిస్తున్నాయని అన్నారు. ఇలాంటి లారీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో సమిశ్రగూడెం ఎస్సై నరేంద్ర, ఏఎస్సై ఎం.ధనరాజు మృతుని కుటుంబసభ్యులతో మాట్లాడి ఆందోళనను విరమింపచేశారు. -
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతదేహం
లక్ష్మీపురం(పెదవేగి రూరల్) : లక్ష్మీపురం పరిధిలోని పోలవరం కుడికాలువ గట్టుపై అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం మంగళవారం లభ్యమైంది. పెదవేగి ఎస్సై వీరంకి రామకోటేశ్వరరావు కథనం ప్రకారం.. పెదవేగి మండలం లక్ష్మీపురం పరిధిలోని సాయిబాబా మందిర సమీపంలో పోలవరం కుడికాలువ గట్టుపై గాయాలతో అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉందని స్థానిక వీఆర్వో పసుపులేటి విష్ణుమూర్తి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరావు, ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళి, ఎస్సై రామకోటేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో చుట్టుపక్కల గాలించారు. ఆమె హత్యకు గురైందా? లేక ఏమై ఉంటుంది అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణా కాలువలో మృతదేహం లభ్యం
ఏలూరు అర్బన్ : వట్లూరు పంచాయతీలోని కృష్ణా కాలువలో మృతదేహాన్ని శనివారం త్రీటౌన్ పోలీసులు వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని కృష్ణా కాలువ ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం పడి ఉం దని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై ఎం. సాగర్‌బాబు సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారించినా ఎలాంటి సమాచారం లభిం^è లేదు. మృతుని శరీరంపై నలుపు రంగు నిక్కరు, తెల్లని చొక్కా ఉన్నాయని, వయసు 40–45 ఏళ్లు ఉంటాయని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామని ఎస్సై చెప్పారు. -
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
ఏలూరు(సెంట్రల్) : రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి స్థానిక నిమ్మలకాయల యార్డ్ సమీపంలో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు కింద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి 5.5 ఎత్తు, లేత నీలరంగు చొక్కా, నల్లపు రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ నెంబరు 9440627572కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు. రైల్వే ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని జిల్లా ప్రభుత్వాపత్రికి తరలించారు. -
యువకుడి దుర్మరణం
యలమంచిలి : మండలంలోని 214 జాతీయ రహదారిపై కలగంపూడి జిట్స్ కళాశాల సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఏనుగువానిలంక గ్రామానికి చెందిన చెల్లుబోయిన రాంబాబు (26) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాంబాబు తండ్రి అనారోగ్యానికి గురవ్వడంతో ఇటీవల రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మెదడుకు శస్త్రచికిత్స చేయించారు. అయినా కోలుకోకపోవడంతో రాజోలు ఎండీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజోలు ఆస్పత్రిలో ఉన్న తండ్రిని చూసి రాంబాబు తిరిగి మోటార్ సైకిల్‌పై స్వగ్రామం ఏనువానిలంక వస్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి మోటార్ సైకిల్‌ను ఈడ్చుకెళ్లి పోవడంతో రాంబాబు అక్కడికక్కడే Mýన్నుమూశాడు. వీఆ ర్వో కె.శ్రీనివాస్ సమాచారం మేరకు సీఐ ఎ.చంద్రశేఖర్ పర్యవేక్షణలో యలమంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించి ఎస్సై అప్పారావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుని తండ్రి ఉమా మహేశ్వరరావు పంచాయతీ వార్డు మెంబరు కాగా రాంబాబు తూర్పుగోదావరి జిల్లా శివకోడులోని ఓ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. -
మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ
నిడదవోలు : ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. పట్టణంలోని గాంధీనగర్ మునిసిపల్ పార్కు వద్ద కాకి అప్పాయమ్మ నివాసముంటున్నారు. బుధవారం ఆమె మెడలోని సుమారు మూడున్నర కాసుల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుని పోయాడు. దీంతో అప్పాయమ్మ భర్త కాకి సూర్యరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం. భగవాన్‌ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.