యువకుడి దుర్మరణం
యువకుడి దుర్మరణం
Published Sat, Apr 22 2017 12:59 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
చాగల్లు: చాగల్లు మండలం ఎస్.ముప్పవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కలవలపల్లి గ్రామానికి చెందిన జానా రాముడు (22) తన స్నేహితుడు జొన్న వెంకటేశ్వరరావుతో కలిసి బైక్‌పై నిడదవోలు వెళ్లారు. అక్కడి నుంచి ఊనగట్ల వెళుతుండగా మార్గమధ్యంలో గురువారం రాత్రి సమయంలో ఎస్.ముప్పవరం గ్రామ శివారు మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న రాముడు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వరరావు కాలు, చేయికి గాయాలయ్యాయి. చాగల్లు ఏఎస్సై ఎం.ధనరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంధువుల ఆందోళన
మృతుడి బంధువులు నిడదవోలు–పంగిడి రహదారిపై ఆందోళనకు దిగారు. శుక్రవారం వేకువజాము వరకు ఆందోళన సాగింది. మాజీ సర్పంచ్ కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ రోడ్డులో క్వారీ లారీలు మితివీురిన వేగంతో వెళుతూ ప్రాణాలను హరిస్తున్నాయని అన్నారు. ఇలాంటి లారీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో సమిశ్రగూడెం ఎస్సై నరేంద్ర, ఏఎస్సై ఎం.ధనరాజు మృతుని కుటుంబసభ్యులతో మాట్లాడి ఆందోళనను విరమింపచేశారు.
Advertisement
Advertisement