Unofficial meetings
-
ఆ కుర్చీలు ఎవరికి!?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనధికార భేటీ సందర్భంగా శుక్రవారం మహాబలిపురంలో పాండవ రథాల ప్రాంగణంలో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూర్చుని కొబ్బరి బోండాలు తాగుతూ సేద తీరిన విషయం గుర్తుంది కదా! వారిద్దరూ కూర్చున్న ఆ కుర్చీలకు ఇప్పుడు భారీ డిమాండ్ వచ్చింది. ఆ ఇరువురు దేశాధినేతలు అక్కడ కాసేపు కూర్చోవాలనేది అకస్మాత్తుగా, ఆ కార్యక్రమానికి రెండు గంటల ముందు తీసుకున్న నిర్ణయం. దాంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులు గిండిలోని ఫర్నిచర్ షోరూం వారిని సంప్రదించి ఇద్దరు అగ్రనేతలు వసతిగా కూర్చునేందుకు రెండు టేకు కుర్చీలు, ఒక టీపాయ్, అనువాదకులు కూర్చునేందుకు మరో రెండు కుర్చీలను హుటాహుటిన తెప్పించారు. వాటికి డబ్బులను కూడా తరువాత ఇస్తామని ఆ షోరూం ఓనర్‌కు చెప్పారు. ఇప్పుడు అగ్రనేతలు కూర్చున్న ఆ రెండు కుర్చీల కోసం రాష్ట్ర ప్రజా పనుల శాఖ, కేంద్ర ప్రభుత్వ అధికారులు పోటీ పడుతున్నారు. అగ్రనేతల పర్యటనకు గుర్తుగా వాటిని తమ వద్దే ఉంచుకోవాలని ప్రజాపనుల శాఖ భావిస్తుండ గా, చరిత్రాత్మక భేటీ స్కృతిచిహ్నంగా ఆ ఫర్నిచర్‌ను తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. మరోవైపు, ‘ఆ ఫర్నిచర్‌కు డబ్బులు వద్దు.. నాకే తిరిగివ్వండి.. నా దగ్గరే గుర్తుగా పెట్టుకుంటా’ అని ఫర్నిచర్ షోరూం ఓనర్ కోరుతున్నారట. -
మాటల్లో కాదు చేతల్లో చూపించారు
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను మాటలు మాత్రమే చెప్పే వ్యక్తిని కాదని నిరూపించుకున్నారు. ఎప్పుడు స్వచ్ఛత జపం చేసే ప్రధాని స్వయంగా శ్రామికుడిలా మారి చెత్తను ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య అనధికార భేటీ శుక్రవారం మహాబలిపురంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు భేటీ ప్రారంభానికి ముందు మోదీ దేశ ప్రజలకు క్లీన్ అండ్ ఫిట్ సందేశాన్ని ఇచ్చారు. శనివారం ఉదయం మోదీ మహాబలిపురం బీచ్‌లో జాగింగ్ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ సాధారణ వ్యక్తిలో సముద్రం తీరంలో అరగంటపాటు తిరిగిన మోదీ... అక్కడున్న చెత్తను స్వయంగా ఆయనే శుభ్రం చేశారు. బీచ్‌లో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను ఆయన చెత్తో క్లీన్ చేశారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘మహాబలిపురం బీచ్‌లో అరగంట పాటు తిరిగాను. అక్కడ నేను సేకరించిన నా కలెక్షన్‌ను హోటల్ సిబ్బందిలో భాగమైన జయరాజ్‌కు అప్పగించాను. మన బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కు లక్షల్లో లైకులు వస్తున్నాయి. మీరు గ్రేట్ సార్.. కేవలం మాటలకే పరిమితం కారు.. చేతల్లో చూపిస్తారు అంటూ.. నెటిజన్లు ఆయనను ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు. (చదవండి: తమిళ.. చైనా మీడియాలో) -
పల్లవించిన స్నేహగీతం
సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగాళాఖాతం తీరంలో, ఏడవ శతాబ్దపు అద్భుత శిల్పకళా నిర్మాణాల నేపథ్యంలో మామల్లపురం(మహాబలిపురం)లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య రెండో అనధికార భేటీ శుక్రవారం సానుకూల వాతావరణం మధ్య ప్రారంభమైంది. చెన్నై నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో మామల్లపురం వచ్చిన జిన్‌పింగ్‌కు మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు పల్లవ రాజులు నిర్మించిన అత్యద్భుత కట్టడాలను సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణలో ఉన్న మోదీ.. జిన్‌పింగ్‌కు ప్రపంచ పురావస్తు నిర్మాణాలుగా యునెస్కో గుర్తింపు పొందిన ఆ శిల్పకళా సంపద చారిత్రక ప్రాధాన్యతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని ఒక గైడ్ తరహాలో వివరించారు. అర్జునుడు తపస్సు చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో ఏకశిలపై నిర్మితమైన కట్టడాన్ని, పంచ రథ రాతి(పాండవ రథాలు) నిర్మాణాన్ని, శ్రీకృష్ణుడి వెన్నముద్ద బంతి(గుండ్రని పెద్దబండరాయి)ని సందర్శించారు. వీటి వివరాలను జిన్‌పింగ్ ఆసక్తిగా విన్నారు. పంచ రథ నిర్మాణ ప్రాంతంలో కొబ్బరి నీరు తాగి కాసేపు సేద తీరారు. ఆ సమయంలో అనువాదకుల సాయంతో ఇరువురు నేతలు ముచ్చటించుకున్నారు. అనంతరం సముద్ర తీరంలో నిర్మితమైన శివ విష్ణు రాతి దేవాలయాన్ని సందర్శించారు. సూర్యాస్తమయం వేళ అక్కడి ప్రకృతి దృశ్యాలను కాసేపు ఆస్వాదించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని సందర్శన సందర్భంగా ఆ దేవాలయాన్ని దీపకాంతులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఆ ఆలయ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాక్షేత్ర ఫౌండేషన్ కళాకారుల బృందం ప్రదర్శించిన భరతనాట్యం, కథాకళి నృత్య ప్రదర్శనలను వీక్షించారు. ఇరువురు నేతలు పలు సందర్భాల్లో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. అన్ని సందర్భాల్లోనూ ఇరువురి నేతల మధ్య నెలకొన్న స్నేహానుబంధం స్పష్టంగా కనిపించింది. నేడు(శనివారం) ఇరువురు నేతలు, రెండు దేశాల ప్రతినిధి బృందాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యం, 3500 కి.మీల సరిహద్దు వెంబడి ఉన్న ఇరుదేశాల సైనిక సహకారం.. తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ముగిసిన తరువాత, చైనా అధ్యక్షుడి గౌరవార్థం ఆలయ ప్రాంగణ ప్రాంతంలోనే మోదీ విందు ఏర్పాటు చేశారు. చెన్నైలో ఘన స్వాగతం అంతకుముందు, శుక్రవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్, ముఖ్యమంత్రి పళనిసామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ తదితరులు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌తో పాటు 90 మంది సభ్యులతో చైనా ప్రతినిధి బృందం కూడా చెన్నై చేరుకుంది. అదే సమయంలో ‘వెల్కమ్ ఇండియా.. ప్రెసిడెంట్ జిన్‌పింగ్’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. విమానాశ్రయంలో జిన్‌పింగ్‌కు స్వాగతం పలుకుతూ కళాకారులు తమిళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చిన్న సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. అనంతరం, చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు జిన్‌పింగ్ వెళ్లారు. అక్కడ కాసేపున్న తరువాత సాయంత్రం మహాబలిపురం బయల్దేరారు. జిన్‌పింగ్ కాన్వాయ్ సాగిన మార్గంలో దారిపొడవునా విద్యార్థులు, ప్రజలు భారత్, చైనా జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. ప్రకటన ఉండొచ్చు గత సంవత్సరం చైనాలోని వుహాన్‌లో జరిగిన అనధికార భేటీ తరహాలోనే.. ఈ భేటీ అనంతరం ఇరుదేశాలు వేరువేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం నుంచి దాదాపు ఆరు గంటల పాటు ఇరువురు నేతలు ముఖాముఖి, ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని పేర్కొన్నాయి. ‘భవిష్యత్తు ద్వైపాక్షిక సంబంధాలకు నూతన మార్గం చూపే పరస్పర ఆమోదిత మార్గదర్శకాలు ఈ భేటీ ద్వారా నిర్ణయమయ్యే అవకాశముంది’ అని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్ పేర్కొన్నారు. విందు సందర్భంగా చర్చలు విందు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలు అంశాలపై చర్చలు జరిపారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ఇరువురు నేతలు వాణిజ్య లోటుపై చర్చించారని, ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారని గోఖలే వెల్లడించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఇద్దరూ ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. అన్ని అంశాలపై ప్రధాని మోదీతో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని జిన్‌పింగ్ తెలిపారని గోఖలే పేర్కన్నారు. విందు సమయంలో ఇద్దరు నేతలు రెండున్నర గంటల పాటు మాట్లాడుకున్నారని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత శక్తిమంతం చేసుకోవాలని, వివాదాస్పద అంశాల కన్నా సంబంధాల బలోపేతానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించారని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అయతే, వారిమధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినదా? లేదా? అన్న విషయం తెలియలేదు. ‘తొలిరోజు అనధికార సమావేశం ఫలప్రదంగా జరిగింది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ ట్వీట్ చేశారు. జిన్‌పింగ్‌కు తమిళ రుచులు చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయనకు ఇష్టమైన మాంసాహార వంటకాలతో పాటు సంప్రదాయ తమిళ వంటకాలను అందించారు. జిన్‌పింగ్‌కు ఇష్టమైన మాంసం, ఉల్లిగడ్డలతో ఓ కర్రీ.. క్యారెట్, క్యాబేజీ, లివర్లతో మరో కూర, నూడుల్స్, సూప్‌లను అందించారు. అవికాకుండా, అన్నం, బిర్యానీ, సాంబారు, టమాట రసం, చపాతీ, బటర నాన్, పులావ్, టమాటా–క్యారెట్ సూప్‌లను కూడా ఆ మెనూలో చేర్చారు. శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, వడ, సాంబారు, చట్నీ, పొంగల్ తదితర తమిళ రుచులను ఆయనకు చూపనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిన్‌పింగ్ కోసం మోదీ ఏర్పాటు చేసిన విందులోనూ తమిళ రుచులను ఏర్పాటు చేశారు. పప్పు, మసాలాలు, కొబ్బరి వేసి చేసిన తమిళ ప్రత్యేక సాంబారును జిన్‌పింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. టమాట రసం, కూర్మా, హల్వాలను మెనూలో చేర్చారు. జిన్‌పింగ్‌కు ఇష్టమైన మాంసాహార వంటకాలనూ అందించారు. తమిళ వస్త్రధారణలో మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మామల్లపురం(మహాబలిపురం) పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. పొట్టి చేతుల తెలుపు రంగు చొక్కా, దానిపై అంగవస్త్రం, ఆకుపచ్చ బోర్డరున్న సంప్రదాయ తమిళ లుంగీని ధరించారు. జిన్‌పింగ్ వైట్ షర్ట్‌ను డార్క్ కలర్ ప్యాంట్‌లోకి ఇన్ చేసుకుని సింపుల్‌గా కనిపించారు. మహాబలిపురంలోని సముద్ర తీరంలోని రాతి దేవాలయం, పంచ రథాలు, అర్జునుడు తపస్సు చేశాడని భావించే ప్రదేశంలోని 73 అడుగుల ఎత్తైన భారీ కళాత్మక నిర్మాణం.. తదితరాలను వారు సందర్శించారు. ఆ సందర్భంగా ఆ ప్రాంత ప్రాముఖ్యతను, ఆ దేవాలయ చరిత్రను, నిర్మాణ విశిష్టతను జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. అనంతరం వారిరువురు కొబ్బరి బోండాలను సేవించి సేదతీరారు. తమిళ సంప్రదాయ వస్త్రాలను మోదీ ధరించడంపై పలు తమిళ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ‘తమిళ సంప్రదాయాన్ని ప్రధాని ప్రపంచానికి చూపారు’ అని పట్టలి మక్కల్ కచ్చి వ్యవస్థాపకుడు ఎస్ రామ్‌దాస్ ట్వీట్ చేశారు. ‘ఏ ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంత సంప్రదాయాలను గౌరవించడం ప్రధాని మోదీకి బాగా తెలుసు. తమిళ పంచెకట్టులో ఆయన సౌకర్యవంతంగా కనిపించారు’ అని తమిళనాడు మంత్రి సీటీ రవి వ్యాఖ్యానించారు. జిన్‌పింగ్‌కు ఆలయ గొప్పదనాన్ని వివరిస్తున్న మోదీ మామల్లపురంలో సముద్ర తీరంలో వారసత్వ కట్టడం -
ఏ సభకైనా రావాల్సిందే!
అధికార, అనధికార సభలకు రావాలని డ్వాక్రా సంఘాలకు టీడీపీ హుకుం రాకుంటే రుణ సాయం ఉండదని హెచ్చరిక బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ బెదిరింపులు దిక్కుతోచని స్థితిలో మహిళా సంఘాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. మెప్మా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు టీడీపీ సభలకు హాజరు కావాలని డ్వాక్రా సంఘాలకు హుకుం జారీచేస్తున్నారు. సభలకు రాని సంఘాలు, సభ్యులను గుర్తించి బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగక రుణసాయాన్నీ ఆపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. తీవ్ర వ్యయప్రయాస లకోర్చి మహిళలు టీడీపీ సభలకు తరలిరావాల్సి వస్తోంది. తిరుపతి, తుడా: జిల్లాలో 12 వేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందులో 1.3 లక్షల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. తిరుపతిలో 3,850 డ్వాక్రా సంఘాల్లో 39 వేల మంది ఉన్నారు. అభ్యుదయ, స్పందన గ్రూపు లీడర్లు వీరిని లీడ్ చేస్తున్నారు. ఏదైనా సభ జరిగితే ప్రజలు రాకపోయినా వీరు వస్తే చాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అనధికారికంగా వీరిపై ఒత్తిడి తీసుకొచ్చి సభలకు రావాలని ఇబ్బందులు పెడుతున్నారు. రానివారిని సంఘం నుంచి తప్పిస్తామని, 10 మందితో కూడిన సంఘంలో ఒకరిద్దరు రాకపోయినా ఆ సంఘానికి ఇబ్బం దులు తప్పవనే హెచ్చరికలు పంపుతున్నారు. అధికార పార్టీ మెప్పుకోసం కొంత మంది లీడర్లు సభ్యులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. సంఘాల ఏర్పాటు ఉద్దేశమిది? మహిళలు ఆర్థికంగా ఎదిగి, సొంతంగా వ్యాపారాలు చేసుకుని, అవసరాలకు రుణ సాయం అందిచేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటయ్యాయి. రుణాల మంజూరు సభలు, సభ్యుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసే సమావేశాలు, స్వయం ఉపాధి అవగాహన, రుణ సద్వినియోగం వంటి సమావేశాలకు సభ్యు లు హాజరుకావాలి. వీటికి మినహా మరే సభలకు పిలవకూడదు. ఎప్పుడూ లేని విధంగా అధికారి పార్టీ నేతలు ప్రతి కార్యక్రమానికీ వీరిపైనే ఆధారపడుతున్నారు. ఒత్తిడి.. హెచ్చరికలు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలతో పాటు టీడీపీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికీ డ్వాక్రా సంఘాల సభ్యులు హాజరుకావాలని ఒత్తిడి తెస్తున్నారు. సమావేశాలకు, సభలకు రానిపక్షంలో అలాంటి సంఘాల సభ్యులకు రుణ సాయం ఉండదని సంఘాల లీడర్ల చేత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లీడర్లూ మెప్పు పొందేందుకు సభ్యులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఖర్చులకు వెనకాడి.. ప్రభుత్వం, టీడీపీ నాయకులు నిర్వహించే సభలకు ప్రజలను తీసుకురావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. రాకపోకలకు, భోజనం, ఇతర ఖర్చులు ఉంటా రుు. ఇవన్నీ భరించేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. దీంతో అధికారి పార్టీ నేత లు డ్వాక్రా సంఘాలపై దృష్టి సారించా రు. జిల్లావ్యాప్తంగా 1.3 లక్షల మందిలో కనీసం సభ జరిగే ప్రాంతానికి చుట్టుపక్కల మండలాల నుంచి 5-10 వేల మంది వచ్చినా సభ విజవంతమవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాదితోపాటు గత ఏడాది అంతకుముందు జరి గిన సీఎం సభలకు అత్యధికంగా సంఘాల సభ్యులనే తరలించి సఫలీకృతులయ్యారు. నొక్కేస్తున్న సంఘాల లీడర్లు సభలకు, సమావేశాలకు సభ్యులను తీసుకురావడానికి అధికార పార్టీ నేతల నుంచి సంఘాల లీడర్లు లెక్క నొక్కేస్తున్నారు. రాను పోను ఖర్చులు, భోజనం తో పాటు ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.500 వరకు సభను బట్టి సభ్యులకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని లీడర్లే బొక్కేస్తున్నట్టు సమాచారం. పనులు వదులుకుని.. పస్తులుంటూ డ్వాక్రా సంఘాల్లో రోజూ కూలీనాలీ చేసుకుని బతికేవారే ఎక్కువ. మరి కొందరు ఏదో చిన్నపనులు చేసుకుంటే తప్ప పూటగడవని పరిస్థితి. ఇలాంటి వారిని సభలు, సమావేశాలకు రావాలని ఒత్తిడి తెస్తున్నారు. సభలు ఎప్పుడు జరుగుతాయో.. ఎప్పుడు ముగుస్తాయో తెలియక వంటలు వండలేక, పిల్లలకు భోజనం పెట్టలేక సభలకు రాలేమని చెప్పలేక మహిళలు మదనపడుతున్నారు. డ్వాక్రా అధికారులపై ఒత్తిళ్లు డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తుడులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో ఇటీవల జరిగిన ఓ సభకు వెయి మందిని తీసుకురావాలని ఓ మంత్రి, ఓ ఉన్నతాధికారి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. సంఘాల లీడర్లతో సమావేశమై ఒక్కో సంఘం నుంచి 500 మందికి తగ్గకుండా సభ్యులను సభకు తీసుకురావాలని హుకుం జారీ చేశారు. వారు సభ్యులపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి సభకు రావాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించి సభకు తీసుకొచ్చారు. ఇలా జిల్లాలో జరిగే ప్రతి సభలోనూ ఇదే ఇదే తంతు.