హైదరాబాద్ చరిత్రలో కొత్త రికార్డు
హైదరాబాద్: ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరంలో పాత రికార్డులు బద్దలయ్యాయి. హైదరాబాద్ చరిత్రలో తాజాగా అత్యధిక వర్షపాతం నమోదైంది. 2000లో అత్యధికంగా 241.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతకుముందు గరిష్టంగా 1908లో 153.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డుగా ఉండేది. ఈ రోజు 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు కాలనీలన్నీ నీటిమునిగాయి. ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. పలు కాలనీలు జలమయం కాగా... రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. కూకట్‌పల్లిలోని చెరువులకు గండిపడడంతో ఇళ్లలోని నీరుచేరింది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. పదిరోజుల క్రితం పరిగి, వికారాబాద్‌లో 21 సెంటీమీటర్ల వాన నమోదై రికార్డు సృష్టించగా... తాగాజా బుధవారం కుత్భుల్లాపూర్ మండలంలో ఏకంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై గత రికార్డును బద్దలు కొట్టింది. అదేవిధంగా కీసర మండలంలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా జిల్లాలో బుధవారం నాడు 5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈనెలలో కురిసిన వర్షాలను పరిశీలిస్తే... ఇప్పటివరకు జిల్లాలో 24 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా.. 11 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. కందుకూరు, మహేశ్వరం మండలాల్లో మాత్రం లోటు వర్షపాతమే నమోదు కావడం గమనార్హం.
కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్
వర్షాల వల్ల ఏర్పడే సమస్యల్ని ఎదుర్కొనేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సిద్దమవుతోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి వినతులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసింది. 18004250817 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యల్ని వివరించాలని కలెక్టర్ రఘు నందన్‌రావు సూచించారు. ఈ కంట్రోల్‌రూమ్‌ను నిరంతరం ముగ్గురు పర్యవేక్షిస్తున్నారని, సమస్య విన్నవించిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాద్ నగర చరిత్రలో అధిక వర్షపాతం నమోదైన వివరాలు..
సంవత్సరం
వర్షపాతం మిల్లీమీటర్లు
1908
153.2
1989
140
2000
241.5
2016 ఆగస్టు 31న
120.5
2016 సెప్టెంబర్ 21న
167.7
రంగారెడ్డి అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు(మిల్లీమీటర్లలో)
ప్రాంతం
వర్షపాతం మిల్లీమీటర్లు
కుత్బుల్లాపూర్
23.0
బషీరాబాద్
10.4
బాలానగర్
11.0
శామీర్‌పేట్
13.4
కీసర
15.0
మల్కాజ్గిరి
10.5
మేడ్చల్
10.6.