అంధుల కోసం...బ్రెయిలీలో ఓ పత్రిక
స్ఫూర్తి
పత్రికలు చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉపాసన మకతీకి కూడా ఉంది. విద్యావంతులైన తల్లిదండ్రులు ఆమెకు చిన్నప్పట్నుంచీ రకరకాల పత్రికలు చదవడం అలవాటు చేశారు. దాంతో ఒకటీ రెండూ కాదు... ఏకంగా పది రకాల పత్రికలు చదివేది ఉపాసన. అలాంటిది ఓసారి ఆమెకు చదివేందుకు పత్రికే దొరకలేదు. ఆ రోజు ఆమె మదిలో ఓ ఆలోచన మెదిలింది. అది ఆమెతో ఐక్యరాజ్యసమితి మెచ్చుకునేంత గొప్ప పని చేయించింది.
పత్రికలు చదివే అలవాటు ఉపాసనకు జర్నలిజం మీద మక్కువను ఏర్పరచింది. అందుకే స్నేహితులంతా ఐఐటీలు అంటూ పరుగులు తీస్తుంటే, ఆమె మాత్రం జర్నలిజంలో పీజీ కోర్సు చేసింది. ఓసారి అనుకోకుండా ఓ మారుమూల గ్రామానికి వెళ్లింది. అక్కడ ఏమీ తోచక ఏదైనా పత్రిక కొనుక్కుందామని వెళ్లింది. ఊరంతా తిరిగినా ఒక్కటి కూడా దొరకలేదు. దాంతో ఆమెకు విసుగొచ్చేసింది. అప్పుడే అనుకుంది... ఒక్కసారి నచ్చిన పత్రిక చదవకపోతేనే నేనిలా ఫీలవుతున్నాను, చూపు లేనివాళ్లు అసలు జీవితంలో పత్రికే చదవరు కదా, వాళ్లకు ఎప్పుడూ చదవాలని అనిపించదా అని. అనుకోకుండా వచ్చిన ఆ ఆలోచన ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టేలా చేసింది. అంధుల కోసం పత్రిక పెట్టేందుకు ప్రోత్సహించింది.
తనకా ఆలోచన రాగానే ముంబైలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ అధికారుల దగ్గరకు వెళ్లి, బ్రెయిలీలో ఓ పత్రిక తీసుకు రావాలనుకుంటున్నానని చెప్పింది ఉపాసన. వాళ్లు ఆశ్చర్యపోయారు. అది సాధ్యం కాకపోవచ్చన్నారు. కానీ ఆమె వదల్లేదు. దాని గురించి తన ఆలోచనలు, ప్రణాళికలు చెప్పింది. ఎట్టకేలకు వారిని ఒప్పించింది. ఓ బ్లాగు పెట్టి ఫ్రీలాన్స రచయితల్ని ఆహ్వానించింది. ఆసక్తికరమైన శీర్షికలతో అంధుల కోసం ‘వైట్ ప్రింట్’ అనే పత్రికను రూపొందించింది. ఇది మన దేశంలో తొట్టతొలి బ్రెయిలీ పత్రిక. ఉపాసన కృషిని ఐక్యరాజ్యసమితి సైతం గుర్తించింది. ఆమెను సత్కరించి ప్రశంసాపత్రాన్ని అందించింది!