అధికారుల్లో ‘మార్పు’ అవసరం
పురిటినొప్పులు దాటని పథకం
అర్బన్ ప్రసూతి ఆస్పత్రుల్లో సౌకర్యాలలేమి
మూడు విభాగాల సిబ్బంది మధ్య సమన్వయలోపం
అస్తవ్యస్తంగా గర్భిణుల గుర్తింపు సర్వే
విజయవాడ, న్యూస్‌లైన్ : మాతాశిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో గర్భిణులను గుర్తించి, ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ‘మార్పు’ పథకం అగమ్యగోచరంగా మారింది. ఈ పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులు చూస్తున్నా, అందుకు అవసరమైన ప్రసూతి వైద్య సౌకర్యాలు, సిబ్బంది లేకుండా ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నారుు. నగరంలో వైద్య ఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ మధ్య సమన్వయలోపం, అర్బన్ ప్రసూతి ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యుల లేమితో ప్రసవాలు చేసే పరిస్థితి లేదు.
మరోవైపు కార్పొరేషన్, అంగన్వాడీ, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ల సిబ్బంది మధ్య సమన్వయం లోపించడంతో నగరంలో గర్భిణుల సర్వే అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. ఒక ప్రాంతంలోని గర్భిణీని మూడు విభాగాలకు చెందినవారు రిజిస్ట్రేషన్ చేయడంతో లెక్కల్లో ముగ్గురిగా నమోదవుతున్నారు. దీంతో మార్పు నగరంలో సక్సెస్ అయ్యేనా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా జిల్లాలో మార్పు పథకం అమలుచేస్తున్నా సత్ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో 11లక్షల జనాభా కలిగిన నగరంలో సిబ్బంది, సౌకర్యాలు లేకుండా ఎలా సక్సెస్ అవుతుందనేది ప్రశ్న.
పథకం లక్ష్యం ఇదే..
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) స్కీమ్‌లో అమలుచేస్తున్న మార్పు పథకం ద్వారా గర్భిణులను గుర్తించి, వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు కచ్చితంగా ఆస్పత్రిలోనే ప్రసవం జరిగేలా చూడాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, మందులు కూడా ఉచితంగా అందించాలి. ఇందుకయ్యే వ్యయాన్ని ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ద్వారా చెల్లిస్తారు. నగరంలో గర్భిణులను గుర్తించేందుకు చేస్తున్న సర్వేనే గందరగోళంగా మారింది.
సర్వే చేసేందుకు కార్పొరేషన్ వద్ద సిబ్బంది లేకపోవడంతో ఆ భారం అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ల సిబ్బందిపై వేశారు. మరోవైపు కొన్ని డివిజన్లలో అంగన్వాడీలు సర్వే చేస్తున్నారు. అంగన్వాడీ, నగరపాలక సంస్థ, కు.ని. సిబ్బంది సర్వేల్లో ఒకే గర్భిణీని ముగ్గురు నమోదు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ వేర్వేరుగా ఉండటంతో ఒకే గర్భిణీ మూడుచోట్ల రిజిస్టర్ అవుతున్నట్లు సిబ్బందే చెబుతున్నారు. మరోవైపు ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ల సిబ్బంది సర్వేకు వెళ్లడంతో సర్జరీ కోసం వచ్చే వారికి సమాధానం చెప్పేవారు లేకుండాపోతున్నారు.
ప్రసూతి సౌకర్యాల లేమి
నగరంలోని ప్రసూతి ఆస్పత్రులన్నీ సౌకర్యాలు, నిపుణుల లేమితో కునారిల్లుతున్నారు. చిట్టినగర్‌లోని షేక్‌రాజా ప్రసూతి ఆస్పత్రి మినహా రాజీవ్‌నగర్, విద్యాధరపురం, కృష్ణలంక, పటమటలోని అర్బన్ ప్రసూతి ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగని దుస్థితి నెలకొంది. దీంతో అందరూ పాత ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు. జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి ప్రసవం కోసం వస్తున్న గర్భిణులతో పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగంలో పడకలు చాలని పరిస్థితి ఉండగా, మరింత మందికి ప్రసవాలు చేయడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
నగర జనాభా 11 లక్షలు ఉండగా, అర్బన్ ప్రసూతి ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రిలో సైతం మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రోగులు సూచిస్తున్నారు. నగరంలో మార్పు అమలు విషయం నగరపాలక సంస్థ అధికారులు చూసుకోవాల్సి ఉందని జిల్లా వైద్యాధికారులు చెబుతుండగా, ఇక్కడి అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని రోగులు కోరుతున్నారు.