ఇక నుంచి అపోలో సేవ
– ప్రైవేట్ సంస్థ చేతిలోకి అర్బన్ ఆరోగ్య కేంద్రాలు
– త్వరలోనే వైద్య సేవలు ప్రారంభం
– కేంద్రాలకు తుది మెరుగులు
– వైద్య సేవల్లో తేడా వస్తే బిల్లుల్లో కోతలే
అనంతపురం మెడికల్ : ‘ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేస్తాం’ అంటూనే వైద్య ఆరోగ్యశాఖలోని ఒక్కో విభాగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు ‘మెడాల్’ చేతుల్లోకి వెళ్లిపోగా..104 వాహన సేవలు కూడా ‘పిరమిల్ స్వాస్థ్య’ ఆధీనంలోకి మళ్లాయి. తాజాగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు సైతం ‘అపోలో’ సంస్థకు కట్టబెట్టారు. ఈ కేంద్రాలను త్వరలోనే ప్రారంభించేందుకు సదరు సంస్థ సన్నాహాలు చేస్తోంది. వైద్య పరికరాలు, వసతులు సమకూర్చుకునే పనిలో పడింది.
జిల్లాలో 19 అర్బన్ హెల్త్ సెంటర్లు
జిల్లాలో 19 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అనంతపురంలో హమాలీకాలనీ, నాయక్‌నగర్, మంగళవారి కాలనీ, ఇందిరాగాంధీ నగర్, నీరుగంటి వీధి, తాడిపత్రి పట్టణంలోని శ్రీనివాసనగర్, టైలర్స్ కాలనీ, గుత్తిలోని బీసీ కాలనీ, గుంతకల్లులోని అంబేద్కర్ నగర్, భాగ్యనగర్, ధర్మవరంలోని శివానగర్, కొత్తపేట, దుర్గానగర్, లక్ష్మీచెన్నకేశవపురం, కదిరిలోని నిజాంవలి కాలనీ, హిందూపురంలోని లక్ష్మీపురం, బోయపేట, ఇందిరానగర్, శ్రీనివాస నగర్లో యూహెచ్‌సీలు ఉన్నాయి. ఇన్నాళ్లూ ఇవి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచేవి. ఏడాదికోసారి రెన్యూవల్ చేస్తుండగా ఈ ఏడాది ‘అపోలో’ సంస్థకు కట్టబెట్టారు.
సేవల్లో తేడా వస్తే బిల్లుల్లో కోత
ఒక్కో ఆస్పత్రికి గాను అపోలో సంస్థకు నెలకు రూ.3.92 లక్షల మేర నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం చెల్లించనుంది. సేవలకు సంబంధించి ఎక్కడైనా రోగులకు అసౌకర్యం కలిగితే వారికిచ్చే సొమ్ములో ప్రభుత్వం కోత విధిస్తుంది. ఒక రోజులో ఓ షిప్ట్‌లో సేవలకు అంతరాయం కలిగితే ఆ రోజు పూర్తి చెల్లించే మొత్తాన్ని నిలిపివేస్తారు. రోజులో రెండు విడతల్లో అంతరాయం కలిగితే నెల చెల్లింపులో 10 శాతం, అదే నెలలో మూడు రోజులకైతే 20 శాతం, అంతకంటే ఎక్కువ అయితే 50 శాతం చొప్పున చెల్లింపుల్లో కోత విధించనున్నారు. ఇదే నిబంధన టెలీ మెడిసిన్ సేవల విషయంలోనూ వర్తిస్తుంది. నెలలో మూడు కంటే ఎక్కువ రోజులు అంతరాయం చొప్పున ఏడాదిలో మూడు సార్లు జరిగితే ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేస్తుంది.
28 రకాల వైద్య పరీక్షలు
ఈ–యూపీహెచ్‌సీల్లో దాదాపు 28 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన వ్యక్తులకు శస్త్ర చికిత్సలను ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించనున్నారు. వైద్య పరీక్షల్లో రక్తం, ప్లేట్లెట్, బ్లడ్ గ్రూప్, గర్భ నిర్ధారణతో పాటు బయోకెమిస్ట్రీ పరీక్షలు చేస్తారు. రక్తంలో చక్కెర, బైల్‌రూబిన్, హెచ్ఐవీ, ఉమ్మి, రక్తంలో యూరియా, ఆల్కేలేన్ పాస్ఫేట్, టోటల్ ప్రొటీన్లు, కొలెస్ట్రాల్ తదితర పరీక్షలు ఇక్కడే నిర్వహించనున్నారు. ఒక్కో చోట ఫిజీషియన్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇద్దరు స్టాఫ్ నర్సులను నియమించనున్నారు. ఇలా ప్రతి పది వేల మందికి ఓ ఫీల్డ్ ఏఎన్ఎం ఉంటారు.