కబ్జాలతో ‘జలాశయాల’ ఉనికికే ప్రమాదం
- సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
- చెట్ల నరికివేతతో మానవ మనుగడ ప్రశ్నార్థకం
- పెద్దషాపూర్లో మొక్కలను నాటిన సీపీ
పెద్దషాపూర్ (శంషాబాద్ రూరల్): నగరవాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కబ్జాలను అరికట్టకుంటే భవిష్యతులో ఈ చెరువులు ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదం ఉంద ని ైసైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెద్దషాపూర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆవరణలో శంషాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జీవన చక్రానికి ఆధారమైన చెట్లను ప్రజలు ఇష్టానుసారంగా నరికివేస్తుండడంతో జీవనాధారం కోల్పోయి.. మానవుడి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. చెట్లను నరికివేస్తూ మన బతుకులను మనమే నాశనం చేసుకుంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమాన్ని అందరూ ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఒక్కరు మొక్క నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మొక్కల పెంపకంపై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణతో పాటు సైబరాబాద్ పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌తో పాటు మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలను పెంచడానికి 10 రోజుల్లోనే 1.7 లక్షల గుంతలు తీసినట్లు పేర్కొన్నారు. వర్షాలను బట్టి వచ్చే మూడు నెలల్లో మొక్కలు నాటుతామని చెప్పారు.
శంషాబాద్ ఠాణాకు కొత్త భవనం..
శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు గ్రామీణ ప్రాంతంలో అనువైన చోట రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తే కొత్త భవనం నిర్మిస్తామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, స్థానిక సర్పంచ్ సత్యనారాయణ అభ్యర్థనకు స్పందించిన ఆయన పోలీస్‌స్టేషన్‌ను రూ.2 కోట్ల కేటాయించి సకల సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌తో పాటు వివిధప్రాంతాల్లో షీ టీంలతో మహిళలపై దాడుల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
సైబరాబాద్‌లోని ప్రతి జోన్, డివిజన్ పరిధిల్లో ఓ మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళా సిబ్బంది కొరత ఉందని, కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు ఎక్కువ శాతం అవకాశాలు ఇస్తామని తెలిపారు. అంతకుముందు కళాజాత బృందం మొక్కల పెంపకంపై పాటల రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, సర్పంచ్ సత్యనారాయణ, డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్లు ఉమామహేశ్వర్రావు, సుధాకర్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టి.రమేష్, నాయకులు రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.