కూరగాయల సాగుకు మంగళం
పడకేసిన ప్రభుత్వ పథకాల్లో మరొకటి చేరింది.. హైదరాబాద్ నగర వాసులకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ఏర్పాటు చేసిన మన ఊరు.. మనకూరగాయల పథకం మూణ్నాల్ల ముచ్చటే అయింది.. ఈ పథకం తమకు లాభిస్తుందన్న వినియోగదారులు, రైతుల ఆశలు ఆదిలోనే ఉసూరుమన్నాయి.. ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం మూలనపడింది..
- పడకేసిన ‘మన ఊరు.. మన కూరగాయలు’
- అమలు మూణ్నాల్ల ముచ్చటే
- అధికారుల మధ్య సమన్వయలోపం
షాబాద్ : ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు కర్నూలు, అనంతపూర్, కడప, వరంగల్, అదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూరగాయలు దిగుమతి అయ్యేవి. అత్యధికంగా రాయలసీమ జిల్లాల నుంచి వచ్చేవి. రాష్ట్ర విభజన అనంతరం అక్కడి నుంచి కూరగాయలు హైదరాబాద్‌కు రావడం పూర్తిగా తగ్గింది. దీంతో నగరంలో కొరత తీవ్రంగా ఏర్పడి కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ైెహ దరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయలు సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు రైతులను ప్రోత్సహిం చేందుకు గతేడాది ఆగస్టులో మన ఊరు.. మ న కూరగాయలు పథకాన్ని ప్రారంభించింది.
ఈ మేరకు జిల్లాలోని చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లో పది గ్రామాలను ఎంపిక చేసింది. ఒక్కో మండలంలో వంద ెహ క్టార్ల చొప్పున సాగు విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో రైతులు పండించిన పంటలు అమ్మేందుకు ప్రభుత్వం చేవెళ్ల, శంకర్‌పల్లిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మొదట్లో అమ్మిన వాటికి డబ్బులు సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేశారు. దీనికితోడు హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యాపారులు కూరగాయలు నాణ్యంగా లేవని తక్కువ ధర చెల్లించేవారు. దీంతో అక్కడ అమ్మకాలు జరిపేందుకు రైతులు నిరాకరించారు. ఒకవైపు మార్కెట్ ధర కన్నా తక్కువ ధర ఇస్తున్నారని రైతులు, మరోవైపు నాణ్యంగా లేని వాటిని తమకు అంటగడుతున్నారని కొనుగోలుదారులు చెబుతున్నారు. దీంతో నెల రోజులు కూడా కొనుగోలు కేంద్రాలు పని చేయలేదు.
సబ్సిడీ విత్తనాలు ఇవ్వరా?
ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి.. సబ్సిడీపై విత్తనాలు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. మా గ్రామంలో ‘మన ఊరు.. మన కూరగాయలు’ రైతు సంఘంలో 115మందిని సభ్యులుగా ఉన్నాం. ఈ ఏడాది ప్రభుత్వం కూరగాయల విత్తనాలు ఇవ్వకపోవడంతో 20శాతం కూడా పంట సాగు చేయలేదు. కొందరు రైతులు బంగారం కుదువపెట్టి విత్తనాలు కొనుగోలు చేశారు.
- బంటు కిష్టయ్య, రైతు, లక్ష్మరావుగూడ