నోకియా ‘ఉర్దూ’ మొబైల్
న్యూఢిల్లీ: టెలికాం శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆవిష్కరిస్తున్న నోకియా ఉర్దూ మొబైల్ ఇది. దేశంలో 15 కోట్ల మంది ఉర్దూ మాట్లాడే ప్రజలు లక్ష్యంగా నోకియా కంపెనీ ఉర్దూ భాషను సపోర్ట్ చేసే నోకియా 114ను అందిస్తోంది. రూ.2,579 ధర ఉండే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ద్వారా ఉర్దూ భాషలో మెసేజ్‌లు, ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చని నోకియా ఇండియా కంపెనీ ఎండీ పి. బాలాజీ చెప్పారు. ఉర్దూతో పాటు హిందీ, ఇంగ్లీష్‌తో సహా మొత్తం 9 భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని వివరించారు. 0.3 మెగా పిక్సెల్ కెమెరా, ఎఫ్ఎం రేడియో, వీడియో స్ట్రీమింగ్ వంటి ఫీచర్లున్న 2జీ నెట్‌వర్క్‌పై పనిచేసే ఈ ఫోన్ టాక్‌టైమ్ 10.5 గంటలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, కర్నాటకల్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని వివరించారు.