‘యూరియా’ పాట్లు
సాక్షి, యాదాద్రి: అన్నదాతలు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. జిల్లాకు సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో రైతన్నలకు పడిగాపులు తప్పడం లేదు. ఇదే అదనుగా ఇటు డీలర్లు, అటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ చీకటి వ్యాపారం సాగిస్తున్నారు. భువనగిరి కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలో భువనగిరికి చెందిన యూరియాను పోలీసులు పట్టుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు పీఏసీఎస్ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. రామన్నపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూకట్టి మరీ కొనుగోలు చేయడం జిల్లాలో యూరియా కొరత ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ.. పైగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టకపోవడం.. వెరసి జిల్లాలో యూరియా యథేచ్ఛగా చీకటిబజార్‌కు తరలిపోతోంది. కరువును అధిగమిస్తూ వరిని సాగుచేసిన రైతాంగాన్ని యూరియా కొరత తీవ్రమైన మనోవేదనకు గురిచేస్తోంది. సకాలంలో యూరియా అందకపోవడంతో రైతన్న పడిగాపులు కాస్తున్నాడు. సరఫరా లేదంటూ డీలర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల అవసరాన్ని కొందరు సొమ్ము చేసుకుంటుండగా మరికొందరు భువనగిరి కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా పక్కా రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఈ దందాకు అడ్డుకట్ట వేయడంలో జిల్లాలో వ్యవసాయాధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు రైతులు నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఎరువుల డీలర్లు, మార్క్‌ఫెడ్ ద్వారా సింగిల్ విండోలు యూరియా సరఫరా చేస్తున్నప్పటికీ బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రవాణా చార్జీల పేరుతో ఎమ్మార్పీ కంటే రూ.70నుంచి రూ.80వరకు అదనంగా అమ్ముతున్నారు. భువనగిరి, వలిగొండ, మోత్కూర్, చౌటుప్పల్, రామన్నపేట, తుర్కపల్లి మండలాల్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నా అధికారులు నియంత్రించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఓఆర్ఆర్పై పట్టుబడ్డ భువనగిరి యూరియా..
భువనగిరి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మధనపల్లికి అక్రమంగా తరలిపోతున్న 10టన్నుల యూరియాను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్పై పోలీసులు తాజాగా పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతోపాటు యూరియాను స్వాధీనం చేసుకున్నారు. సోడియం నైట్రేట్ పేరుతో వెళ్తున్న లారీలో అమ్మోనియం నైట్రేట్ ఉండడంతో ఈ చీకటి వ్యాపారం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు అక్రమంగా హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని తెలుస్తోంది.
బస్తా యూరియా రూ.350పై మాటే..
యూరియా బస్తా ఎమ్మార్పీ ప్రకారం రూ.266.85 విక్రయించాలి. డీలర్లు రవాణా చార్జీల పేరుతో కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. కంపెనీలు సరఫరా చేసిన ర్యాక్ పాయింట్ నుంచి తీసుకొవచ్చిన యూరియా రవాణా చార్జీల పేరుతో ధరలు పెంచేస్తున్నారు. సరైన తనిఖీలు లేకపోవడంతో యూరియాను రాక్‌పాయింట్ నుంచే చీకటిబజార్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది. అలాగే రైతులకు అమ్మే యూరియాపై అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో యూరియా బస్తాను హోల్‌సెల్ డీలర్లే రూ.320కి రిటైల్ డీలర్లకు విక్రయిస్తుండగా రిటైల్ డీలర్ రైతులకు రూ.350కిపైగా విక్రయిస్తున్నారు. రైతులు సీజన్‌కు అనుగుణంగా యూరియా కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పత్తా లేకుండా పోయారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రో జులుగా భువనగిరిలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న అటువైపు కన్నెత్తి చూసే అధికారే లేకుండాపోయారని రైతులు ఆరోపిస్తున్నారు.
నిజంగా యూరియా కొరత ఉందా..!
జిల్లాలో యూరియా కొరతపై అధికారులు రైతులకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కనీసం రైతుల అవసరాలను గుర్తించి యూరియా కొరతపై అధికారులు ప్రచారం నిర్వహించ లేకపోతున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల పలు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఎంత యూరియా ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది అన్న విషయాన్ని అధికారులు ప్రకటించలేదు. అయితే 20రోజులుగా కురుస్తున్న చెదురుమదురు వర్షాలతో పంటలకు యూరియా కోసం రైతులు దుకా ణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. యూరి యా కంపెనీల నుంచి సరిపోను యూరియా సప్లయ్ చేయకపోవడంతో కొరత ప్రారంభమైంది. జిల్లాకు వచ్చిన యూరియాలో 50శా తం సింగిల్‌విండోల ద్వారా, 50శాతం ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు.
ట్రాన్స్‌పోర్టు చార్జీల పేరుతో వసూలు..
యూరియా డీలర్‌కు సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్‌పోర్టు చార్టీల పేరుతో వసూలు చేస్తున్నాయి. మిర్యాలగూడ, హైదరాబాద్ ర్యాక్‌ల నుంచి బస్తాకు అదనంగా కిరాయి రూ.20 నుంచి రూ.30వరకు వసూలు చేస్తుండడంతో, డీలర్‌కు చేరే సరికే అది ఎమ్మార్పీ ధర కంటే మించిపోతోంది. జిల్లాలో కోరమాండల్, నాగార్జున, ఉజ్వల, ఇప్కో, క్రుబ్కో, స్పీక్, గోదావరి యూరియా కంపెనీలు ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.
డిమాండ్ 42వేల మెట్రిక్ టన్నులు వచ్చింది 12వేల మెట్రిక్ టన్నులు
ప్రస్తుతం జిల్లాలో సాగైన పంటల అవసరాల కోసం సుమారు 42,223 మెట్రిక్ టన్నుల యూ రియా డిమాండ్ ఉండగా కాని ఇప్పటి వరకు కేవలం 12వేల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇందులో 6వేల మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌కు కేటాయించగా, 6వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల దుకాణాలకు కేటాయించారు. దుకాణాల నుంచి రైతులకు చేరింది తక్కువేనని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
ప్రస్తుత ఖరీఫ్‌లో కావాల్సిన యూరియా 42,200 మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు జిల్లాకు సరఫరా అయ్యింది 12,000 మెట్రిక్ టన్నులు