సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే
ప్రముఖ ఆర్ అండ్ బీ గాయకుడు అషర్ మాజీ భార్య తమెకా ఫాస్టర్ తాజాగా జార్జియాలోని అతి పెద్ద సరస్సును ఖాళీ చేయించాలని అధికారులను కోరుతున్నారు. దానిలో ఆమె కుమారుడు 11 సంవత్సరాల క్రితం జెట్ స్కీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఫ్యాషన్ డిజైనర్ తమెకా ఫాస్టర్ అట్లాంటాకు ఈశాన్యంగా ఉన్న 44-మైళ్ల పొడవైన రిజర్వాయర్ లేక్ లానియర్ "డ్రెయిన్, క్లీన్,రీస్టోర్" కోసం ఆన్లైన్ పిటిషన్ వేసి, 3 వేలకు మించిన సంతకాలను సేకరించారు.
ఈ భారీ సరస్సు పూర్తిగా ఎండిపోయినప్పుడే అధికారులు దానిలోని ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా తొలగించగలరని ఆమె అంటోంది. వ్యక్తిగత వాటర్‌క్రాఫ్ట్, వినోద కార్యక్రమాలలో నిమగ్నమయ్యేవారి రక్షణ కోసం సరస్సు వద్ద మెరుగైన భద్రతా చర్యలను చేపట్టాలని ఫోస్టర్ సూచించారు. ఆమె 11 ఏళ్ల కుమారుడు కిల్ గ్లోవర్ జూలై 2012లో లేక్ లానియర్లోని లోపలి ట్యూబ్‌పై తేలుతుండగా, వారి కుటుంబ స్నేహితుడు జెఫ్రీ హబ్బర్డ్ నడుపుతున్న జెట్ స్కీ ఆ బాలునిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కైల్ - బౌన్స్ టీవీ వ్యవస్థాపకుడు ర్యాన్ గ్లోవర్ కుమారుడు, అషర్ సవతి కొడుకు బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. అయితే ఆ బాలుడు చనిపోయే ముందు రెండు వారాల పాటు లైఫ్ సపోర్ట్‌లో ఉన్నాడు.
ఈ నేపధ్యంలో హబ్బర్ట్పై హత్య కేసు నమోదయ్యింది. అతను దోషిగా నిర్ధారణ కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 15 ఏళ్ల పరిశీలన శిక్ష విధించారు. తన కుమారుని విషయంలో ఎదురైన ఈ సంఘటన సరస్సులో సరైన జోనింగ్, భద్రత, రక్షణ చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నదని ఫోస్టర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ తెలిపిన వివరాల ప్రకారం సరస్సుపై భారీ ట్రాఫిక్ కారణంగా గత మూడు దశాబ్దాల్లో వందలాది పడవలు పరస్పరం ఢీకొన్నాయి. 1994-2018 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో 170కు మించిన మరణాలు చోటుచేసుకున్నాయి. 73 ఏళ్ల క్రితం నాటి ఈ మానవ నిర్మిత సరస్సు నీటి ప్రవాహాలపై ప్రభావం చూపుతున్నదని, ఇది ఇక్కడ వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ప్రమాదకరంగా పరిణమించిందని ఫోస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాహూచీ రివర్కీపర్ కన్జర్వేషన్ గ్రూప్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సరస్సు 5 మిలియన్ల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది.
ఆస్కార్విల్లేలోని నల్లజాతి కమ్యూనిటీకి ముంపును తెచ్చిపెడుతూ ప్రమాదకరంగా పరిణమించిన ఈ సరస్సును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, తద్వారా ఇటువంటి విషాదాలను నివారించవచ్చని ఫోస్టర్ పేర్కొంది. ఈ లేక్‌లోని నీటిని తోడి వేసిన తరువాత నీటి సంబంధిత కార్యకలాపాల కోసం కఠినమైన నిబంధనలను అమలు చేయాలని, జోనింగ్‌ను ప్రవేశపెట్టాలని ఫోస్టర్ ప్రతిపాదించింది. కాగా ఫోస్టర్, అషర్లు 2009లో విడాకులు తీసుకున్నారు. వీరికి అషర్ రేమండ్, నావిడ్ అనే ఇద్దరు కుమారులున్నారు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్!