usibc
-
భారత్‌లో అపార అవకాశాలు
వాషింగ్టన్: ఇన్వెస్టర్లు, వ్యాపార సంస్థలకు భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు పథకాల గురించి వివరించారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు మరింతగా పెట్టుబడులు పెట్టాలని, కొత్త కంపెనీలు.. మదుపుదారులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావాలని ఆమె ఆహా్వనించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సుల్లో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా పలు బహుళ జాతి దిగ్గజాల సీఈవోలతో నిర్మలా సీతారామన్ వరుసగా భేటీ అవుతున్నారు. ఆమ్వే సీఈవో మిలింద్ పంత్‌తో సమావేశమైన సందర్భంగా తయారీ రంగంలో ఆటోమేషన్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు వంటి అంశాలపై ఆమె చర్చించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ బి మార్క్ అలెన్‌తో భేటీలో నవకల్పనలు, ఏరోస్పేస్ రంగంలో అవకాశాల గురించి ప్రస్తావించారు. -
తెలంగాణది భిన్నమైన ముద్ర
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు మొత్తం భారతదేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలను భిన్న యూనిట్‌గా పరిగణించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. యూఎస్ఐబీసీ ఇన్వెస్ట్మెంట్ వెబ్‌నార్‌లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. స్థూలంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసినప్పుడు, ప్రత్యేకంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు పెట్టుబడి అవకాశాల్లో చాలా తేడా ఉంటుందన్నారు. గత ఆరేళ్లలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో భిన్నంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలతో రాష్ట్రం వినూత్న పంథాలో పురోగమిస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ విధానం కింద కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల అనుమతులిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ విధానం విజయవంతం అయిందని, అనుమతులు ఇచ్చిన వాటిలో 80 శాతానికి పైగా పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించిందన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కరోనా సంక్షోభంలో ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలబడుతుందన్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగానికి సంబంధించి అనుకూల వాతావరణం ఉందని, ప్రస్తుతం అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ప్రాంగణాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయన్నారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైస్ పార్క్ తెలంగాణలో ఉందని, ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇ న్వెస్ట్మెంట్ వెబ్‌నార్‌లో పాల్గొన్న అమెరికన్ కంపెనీల అధినేతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా టీ–ఐపాస్ విధానం, ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతుపైన తెలంగాణ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అధినేతలు ప్రశంసించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని యూఎస్ఐబీసీ అధ్యక్షురాలు నిషా బిశ్వాల్ తెలిపారు. -
సుందర్ పిచాయ్‌కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు
వాషింగ్టన్: గూగుల్ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీ రంగంలో ఈయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన అమెరికా–భారత వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ).. ప్రతి ఏడాది ఇచ్చే గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు పిచాయ్‌ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈయనతో పాటు నాస్డాక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్మాన్ పేరును ప్రకటించిన యూఎస్ఐబీసీ.. ఇరువురి నేతృత్వంలోని కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయడంలో తమవంతు కృషిచేసినట్లు కొనియాడింది. ఇరు సంస్థల కారణంగా భారత్, అమెరికా మధ్య వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం గడిచిన ఐదేళ్లలో 150 శాతం పెరిగి గతేడాదినాటికి 142.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. ఇక వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో ఇరువురికి అవార్డులను అందించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో 8.8 కోట్లకు 5జీ కనెక్షన్లు..! జీఎస్ఎంఏ అంచనా న్యూఢిల్లీ: భారత మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2025 నాటికి 92 కోట్లకు చేరనుందని గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య (జీఎస్ఎంఏ) అంచనావేసింది. ఇదేసమయంలో 5జీ కనెక్షన్లు 8.8 కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది. 2018 చివరినాటికి మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 75 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఈ రంగ ఆదాయం 2016 నుంచి 20 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది. -
హెచ్1 బి వీసా కొత్త ప్రతిపాదన అత్యంత చెత్త పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ 1 బి వీసాల తాజా కఠిన నిబంధనలపై అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) స్పందించింది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బి వీసాలకు గడవు పొడిగించక పోవడం, నిబంధనలు కఠినతరం చేస్తుండడం పట్ల భారతీయ ఐటి సంస్థల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిబంధనలపై యుఎస్ఐబిసి నిరసన వ్యక్తం చేసింది. ఇది అమెరికాలోని నిపుణులైన భారతీయ ఉద్యోగుల పాలిట అత్యంత చెత్త పాలసీగా నిలుస్తుందని పేర్కొంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఇక హెచ్1 బి వీసాను పొడిగించుకునే అవకాశం లేకుండా చేయాలన్న ప్రతిపాదన ఐటీ ఉద్యోగులకు ఇది నష్టకరమని వ్యాఖ్యానించింది. గత కొన్నేళ్లుగా అమెరికాలో సేవలందిస్తున్న అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అలాంటి అవకాశాన్ని దూరం చేయడం సరైంది కాదంది. వారు అమెరికాలో అనేక సంవత్సరాల పాటు పనిచేస్తున్నారని యుఎస్ఐబిసి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం అమెరికన్ వ్యాపారాన్ని, తమ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చడంతోపాటు దేశానికి హాని చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా మెరిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ లక్ష్యాలకు భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల ప్రభావం ఇండియన్లపై తీవ్రంగా కన్పిస్తోంది. వేలాది మంది ఇండియన్లు ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండడంతో వేలాది మంది ఇండియన్ టెక్కీలు ఆందోళనలో పడ్డారు. బై అమెరికన్, హైర్ అమెరికన్ నినాదంతో హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. -
మోదీ-ట్రంప్ చర్చలకు అది అడ్డురాదు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హెచ్-1బీ వీసాలపై ఆందోళనలు విపరీతంగా పెరిగాయి. హెచ్-1బీ వీసాల్లో కఠితనరమైన నిబంధనలు తీసుకొస్తూ భారత టెకీలకు, దేశీయ టెక్నాలజీ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ట్రంప్ దేశాధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన తర్వాత తొలిసారి ఆయనను కలువడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెలాఖరున అమెరికా వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్-మోదీల మధ్య పలు అంశాలపై చర్చలు జరుగనున్నాయి. తొలిసారి నిర్వహించబోతున్న ఈ చర్చలకు హెచ్-1బీ వీసా విషయం ఎలాంటి సమస్య సృష్టించదని టాప్ అమెరికన్ బిజినెస్ అడ్వకసీ గ్రూప్ చెప్పింది. ఇరునేతల చర్చలు విజయవంతమవుతాయని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఇరు దేశాలకు విన్-విన్ ఫార్మాలలో ఈ పర్యటన ఉంటుందని తాము విశ్వసిస్తున్నామని, ప్రధాన పర్యటన సాఫీగా సాగుతుందని తాము ఆశాజనకంగా ఉన్నామని ప్రముఖ భారతీయ వ్యాపార మండలి(యూఎస్ఐబీసీ) ప్రెసిడెంట్ ముఖేష్ అఘి చెప్పారు. అమెరికాలో యూఎస్ఐబీసీ ప్రముఖ వ్యాపార విభాగంగా పనిచేస్తోంది. జూన్ 26న ట్రంప్ తో మోదీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉగ్రవాదం, హెచ్-1బీ వీసాల్లో మార్పులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయని తెలుస్తోంది. అయితే ఇరునేతల చర్చల్లో హెచ్-1బీ వీసా ప్రధాన అంశం కాదని అఘి చెప్పారు. ''ఇరు నేతల సమావేశంలో హెచ్-1బీ విషయం సమస్యను సృష్టిస్తుందని నేను భావించడం లేదు. మరింత సమర్థవంతంగా, మరింత పోటీతత్వ మార్కెట్ గా మారడానికి అమెరికా ఇండస్ట్రికి టెక్నికల్ వనరులు అవసరం. ఇదే సమయంలో భారత్ నుంచి ఈ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. హెచ్-1బీ వీసా విషయం కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు. అమెరికా బిజినెస్ కమ్యూనిటీ సమస్య ఇది. డిమాండ్, సప్లై విషయమిది'' అని అఘి పేర్కొన్నారు. తమ యూఎస్ఐబీఐ ఎప్పటికీ హెచ్-1బీ ప్రొగ్రామ్ కు మద్దతిస్తుందని చెప్పారు. అయితే ట్రంప్ ఎన్నికల ముందు నుంచి, ఆ తర్వాత కూడా హెచ్-1బీ వీసాలపై మండిపడుతున్నారు. ఈ వీసాల విషయంలో భారత కంపెనీలు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీసాలపై కఠినతరమైన నిబంధనలను తీసుకొస్తున్నారు. ఈ నిబంధనలను నిరసిస్తూ ఇప్పటికే పలుమార్లు భారతీయ అధికారులు ట్రంప్ అధికారులతో చర్చలు నిర్వహించారు. ప్రస్తుతం మోదీ పర్యటనలో వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. -
‘ట్రంప్‌తో భారత్‌కు చాలా మేలు జరుగుతుంది’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గంతో భారత్‌కు ఎంతో మేలు చేకూరనుందని అమెరికాలోని ప్రముఖ భారతీయ వ్యాపార మండలి(యూఎస్ఐబీసీ) తెలిపింది. అమెరికాలో యూఎస్ఐబీసీ ప్రముఖ వ్యాపార విభాగంగా పనిచేస్తోంది. దీని అధ్యక్షుడు ముఖేశ్ అఘి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘అమెరికాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ అవసరం ఉంది. ప్రస్తుతం జియోపొలిటికల్ విధానంలో భారత్ కూడా కాస్తంత ఆందోళనకరమైన పరిస్థితుల మధ్య ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి కూడా వాషింగ్టన్ అవసరం ఉంది. ఇప్పటి వరకు భారత్-అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను బట్టి చూస్తే ట్రంప్ పరిపాలన వర్గం భారత్‌కు చాలా ఉపకరించనుంది. అమెరికా ఎందుకు భారత్ వైపు చూస్తుందంటే మొదటది భారత ఆర్థిక శ్రేయస్సు అనే అంశం అమెరికాకు మేలు చేయనుంది. ఇక రెండో అంశం ఏమిటంటే.. భారత్ తనను తాను సమర్థంగా రక్షించుకోగల సైనిక బలాన్ని నానాటికి పెంచుకుంటూ పోతుంది’ ఈ రెండు అంశాలు అమెరికా భారత్‌వైపు చూసేందుకు కారణం. అలాగే భారత్ కూడా అమెరికాను బలమైన దేశంగా నమ్ముతోంది. ట్రంప్ పాలన వర్గం మోదీ ప్రభుత్వం మధ్య బలమైన సానుకూల ఒప్పందాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఈ ఏడాది తర్వాత వీరిద్దరు సమావేశం అయ్యే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు.