మోదీ-ట్రంప్ చర్చలకు అది అడ్డురాదు
మోదీ-ట్రంప్ చర్చలకు అది అడ్డురాదు
Published Sat, Jun 17 2017 4:12 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హెచ్-1బీ వీసాలపై ఆందోళనలు విపరీతంగా పెరిగాయి. హెచ్-1బీ వీసాల్లో కఠితనరమైన నిబంధనలు తీసుకొస్తూ భారత టెకీలకు, దేశీయ టెక్నాలజీ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ట్రంప్ దేశాధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన తర్వాత తొలిసారి ఆయనను కలువడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెలాఖరున అమెరికా వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్-మోదీల మధ్య పలు అంశాలపై చర్చలు జరుగనున్నాయి. తొలిసారి నిర్వహించబోతున్న ఈ చర్చలకు హెచ్-1బీ వీసా విషయం ఎలాంటి సమస్య సృష్టించదని టాప్ అమెరికన్ బిజినెస్ అడ్వకసీ గ్రూప్ చెప్పింది.
ఇరునేతల చర్చలు విజయవంతమవుతాయని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఇరు దేశాలకు విన్-విన్ ఫార్మాలలో ఈ పర్యటన ఉంటుందని తాము విశ్వసిస్తున్నామని, ప్రధాన పర్యటన సాఫీగా సాగుతుందని తాము ఆశాజనకంగా ఉన్నామని ప్రముఖ భారతీయ వ్యాపార మండలి(యూఎస్ఐబీసీ) ప్రెసిడెంట్ ముఖేష్ అఘి చెప్పారు. అమెరికాలో యూఎస్‌ఐబీసీ ప్రముఖ వ్యాపార విభాగంగా పనిచేస్తోంది. జూన్ 26న ట్రంప్ తో మోదీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉగ్రవాదం, హెచ్-1బీ వీసాల్లో మార్పులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయని తెలుస్తోంది. అయితే ఇరునేతల చర్చల్లో హెచ్-1బీ వీసా ప్రధాన అంశం కాదని అఘి చెప్పారు.
''ఇరు నేతల సమావేశంలో హెచ్-1బీ విషయం సమస్యను సృష్టిస్తుందని నేను భావించడం లేదు. మరింత సమర్థవంతంగా, మరింత పోటీతత్వ మార్కెట్ గా మారడానికి అమెరికా ఇండస్ట్రికి టెక్నికల్ వనరులు అవసరం. ఇదే సమయంలో భారత్ నుంచి ఈ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. హెచ్-1బీ వీసా విషయం కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు. అమెరికా బిజినెస్ కమ్యూనిటీ సమస్య ఇది. డిమాండ్, సప్లై విషయమిది'' అని అఘి పేర్కొన్నారు. తమ యూఎస్ఐబీఐ ఎప్పటికీ హెచ్-1బీ ప్రొగ్రామ్ కు మద్దతిస్తుందని చెప్పారు.
అయితే ట్రంప్ ఎన్నికల ముందు నుంచి, ఆ తర్వాత కూడా హెచ్-1బీ వీసాలపై మండిపడుతున్నారు. ఈ వీసాల విషయంలో భారత కంపెనీలు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీసాలపై కఠినతరమైన నిబంధనలను తీసుకొస్తున్నారు. ఈ నిబంధనలను నిరసిస్తూ ఇప్పటికే పలుమార్లు భారతీయ అధికారులు ట్రంప్ అధికారులతో చర్చలు నిర్వహించారు. ప్రస్తుతం మోదీ పర్యటనలో వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
Advertisement