కంగారు వద్దులే.. ఇంకా టైముంది!
సోనమ్ కపూర్ అభిమానులకు స్వీట్ న్యూస్. ఇప్పుడప్పుడే ఈ బ్యూటీ హాలీవుడ్‌కి వెళ్లడం లేదు. ప్రముఖ అమెరికన్ కాస్టింగ్ ఏజెన్సీ ‘యునెటైడ్ టాలెంట్ ఏజన్సీ’ (యూటీఏ)తో గురువారం సోనమ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దాంతో అంతా అయిపోయింది. ఇక, సోనమ్ సోయగాలు, ఫ్యాషన్ వెలుగులు ఇండియన్ సినిమాల్లో చూడడం కష్టమేనని ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఎందుకంటే.. హాలీవుడ్లో ‘క్వాంటికో’ టీవీ సిరీస్, ‘బేవాచ్’ సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత ప్రియాంకా చోప్రా, ‘త్రిబుల్ ఎక్స్: ది జాండర్ కేజ్’లో నటిస్తుండగానే దీపికా పదుకునేలు హిందీ సినిమాల్లో కనిపించడం తగ్గించారు.
ఇప్పుడు సోనమ్ కూడా ఎక్కడ దూరం అవుతుందోనని ఫ్యాషన్ ప్రియులు, ఆమె అభిమానులు ఫీలయ్యారు. ఇది సోనమ్ దృష్టికి వెళ్లినట్టుంది. శుక్రవారం మరో స్టేట్మెంట్ ఇచ్చారు. ‘‘నేను ఏ సినిమాకీ (హాలీవుడ్లో) సంతకం చేయలేదు. వాళ్లూ అవకాశం ఇవ్వలేదు’’ అని సోనమ్ పేర్కొన్నారు.
‘‘కంగారు వద్దు, హాలీవుడ్లో యాక్ట్ చేయడానికి ఇంకా చాలా టైముంది’’ అన్నట్లు సోనమ్ వ్యవహరిస్తోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఏంటో.. సోనమ్ తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం హాలీవుడ్లో ఏ సినిమాకీ సంతకం చేయనప్పుడు యూటీఏ తో అగ్రిమెంట్ చేసుకోవడం ఎందుకో? అని చర్చ మొదలైంది. మరి.. సోనమ్ హాలీవుడ్ ఎప్పుడు వెళుతుందో?