ఫేస్బుక్ పోస్టు వివాదాస్పదం..
భువనేశ్వర్: సోషల్ మీడియా ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టు ప్రసారం చేసిన ఆరోపణ కింద విద్యాధికులు కూడా చిక్కుకుంటున్నారు. ఇటువంటి సంఘటన స్థానిక ఉత్కళ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. అభ్యంతరకర పోస్టు చేసిన ఆరోపణతో వివరణ కోరుతూ సదరు అధ్యాపకునికి ఉత్కళ విశ్వవిద్యాలయం క్రమశిక్షణ వర్గం తాఖీదుల్ని జారీ చేసింది. సోషల్ మీడియలో పరిధి దాటితే ఎంతటి వారైన అభాసుపాలు కావడం తథ్యమని తాజా సంఘటన రుజువు చేస్తుంది.
ఉత్కళ విశ్వవిద్యాలయం సైకాలజి విభాగం సహాయ ప్రొఫెసరుగా పనిచేస్తున్న మహేశ్వర్ శత్పతి అధికార వర్గాలకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలతో ఫేస్బుక్లో పోస్టు చేసినట్టు ఆరోపణ. తుది ఫలితాల ప్రకటనకు ముందు విద్యార్థుల మార్కుల జాబితాను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయడం అభ్యంతరకరంగా మారింది. ఈ మేరకు వివరణ కోరుతూ ఆయనకు అధికార వర్గం తాఖీదుల్ని జారీ చేసింది. ఉత్కళ విశ్వవిద్యాలయం పోస్టుగ్రాడ్యుయేటు మండలి అధ్యక్షుడు ఈ తాఖీదుల్ని జారీ చేశారు.