బీజేపీకి తప్పని తిరుగుబాట్ల తలనొప్పి
పణజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ నాలుగు స్థానాల్లో అసమ్మతిని ఎదుర్కొంటోంది. పనాజీ, మాండ్రేమ్, సంగూమ్, కుంభర్జువా స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు కమలం పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇటీవల బీజేపీని వీడిన ఉత్పల్ పారికర్ ప్రతిష్టాత్మక పణజి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న అటానాసియో మోన్సెరట్టెపై ఆయన పోటీ చేస్తున్నారు.
మాండ్రెమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీజేపీకి తిరుగుబాటు తప్పలేదు. మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇటీవలే కమలం గూటికి నుంచి బయటకు వచ్చారు. 2017లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను ఓడించిన దయానంద్ సోప్టేపై ఆయన బరిలోకి దిగుతున్నారు. 2019లో దయానంద్ అధికార బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. (చదవండి: ప్రధాన పార్టీలకు.. వలసల దెబ్బ)
సంగెం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవేలార్ భార్య సావిత్రి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆమె.. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుభాష్ ఫాల్దేశాయ్‌పై పోటీకి రెడీ అయ్యారు. సంగెం స్థానానికి ప్రస్తుత సభలో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రసాద్ గాంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి నిలబడ్డారు.
కుంభార్జువా నియోజకర్గంలోనూ కాషాయ పార్టీకి తిరుగుబాటు తప్పలేదు. రోహన్ హర్మల్కర్ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పాండురంగ్ మద్కైకర్ భార్య జైనితా మద్కైకర్పై ఆయన పోటీ చేస్తున్నారు. అయితే పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కుమారుడు సిద్ధేష్ నాయక్‌ను బీజేపీ శాంతింపజేయడంతో కొంతలో కొంత ఊరట. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఫిబ్రవరి 14న జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. (చదవండి: పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి)