18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1000
డెహ్రడూన్: పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారం ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రెండు రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాలు కురిపిస్తున్నారు. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పంజాబ్‌లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని గత నెలలో ప్రకటించిన కేజ్రీవాల్.. తాజాగా ఉత్తరాఖండ్ ఓటర్లకు ఇదే హామీ ఇచ్చారు. కుమావోన్‌లోని యుఎస్ నగర్‌లోని కాశీపూర్ ప్రాంతంలో తన ఒకరోజు పర్యటన సందర్భంగా కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. యుఎస్ నగర్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సొంత జిల్లా కావడం విశేషం. అవినీతిని అరికట్టి ఆ నిధులను మహిళలకు ఇస్తానని ఆయన చెప్పారు.
డబ్బులు ఎలా తెస్తానంటే..?
‘నేను ఇచ్చిన హామీ అమలు చేయడానికి డబ్బులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో చెబుతాను. ఉత్తరాఖండ్ రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ. 55000 కోట్లు. రాష్ట్రంలో 60 నుంచి 80 శాతం వరకు అవినీతి ఉందని అంటున్నారు. ఉదాహరణకు 20 శాతం అవినీతి ఉందనుకుందాం. బడ్జెట్ 55,000 కోట్లలో 20 అంటే దాదాపు రూ.11000 కోట్లు. అది రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లి అక్కడి నుంచి స్విస్ బ్యాంకులకు వెళుతోంది. నేను ఇచ్చిన హామీ అమలు చేయడానికి రూ. 3 వేల కోట్లు అవసరమవుతాయి. అవినీతిని అరికట్టి, స్విస్ బ్యాంకులకు వెళ్లే డబ్బును ఆపుతాను. దీంతో స్విస్ బ్యాంకులకు వెళ్లే డబ్బు ఇక్కడి మహిళల ఖాతాల్లోకి వస్తుంద’ని కేజ్రీవాల్ వివరించారు.
ఉచిత తీర్థయాత్ర.. లక్ష ఉద్యోగాలు
ఈ ఏడాది కేజ్రీవాల్.. ఉత్తరాఖండ్‌కు రావడం ఇది ఐదవసారి. నవంబర్ 21న, హరిద్వార్‌లో ఒకరోజు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో ‘ఆప్’ అధికారంలోకి వస్తే, ఢిల్లీలో తమ ప్రభుత్వం అందించిన విధంగా రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత తీర్థయాత్ర సేవలను అందిస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికి (హర్ ఘర్ రోజ్‌గార్) ఉపాధి కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు 5 వేల రూపాయల చొప్పున స్టైఫండ్ అందజేస్తామని సెప్టెంబరులో నైనిటాల్ జిల్లా పర్యటన సందర్భంగా కేజ్రీవాల్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీయిచ్చారు. (చదవండి: ప్రమాదం కాదు.. పథకం ప్రకారమే చంపేశారు!)
సీఎం అభ్యర్థిగా అజయ్ కొథియాల్
తమ పార్టీ ముఖ్యమంత్రిగా కల్నల్ అజయ్ కొథియాల్ (రిటైర్డ్)ని ఆగస్ట్ 17న కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసం ఉత్తరాఖండ్‌ను ఆధ్యాత్మిక రాజధానిగా మారుస్తామన్నారు. జూలై 11న, కేజ్రీవాల్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు.. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీయిచ్చారు. (చదవండి: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ)