కాంగ్రెస్ పార్టీకి షాక్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, బీజేపీ విజయం సాధిస్తుందని యాక్సిస్-ఇండియా టుడే నిర్వహించిన ఒపీనియన్ పోల్లో తేలింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ 38 నుంచి 43 సీట్లు గెలిచే అవకాశముంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్లో బీజేపీ మెజార్టీ మార్క్ దాటుతుంది.
దాదాపు 50 శాతం మంది ఓటర్లు బీజేపీ సీనియర్ నేత బీసీ ఖండూరి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు సర్వేలో తేలింది. 2007-09 మధ్య, మరో పర్యాయం 2011-12 మధ్య కాలంలో ఖండూరి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 26 నుంచి 31 సీట్లు రావచ్చని సర్వేలో తేలింది. కాగా ముఖ్యమంత్రి హరీశ్ రావత్పై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. 41 శాతం మంది ఓటర్లు హరీశ్ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారు.