uttarpradesh government
-
దీప్తీ శర్మకు అరుదైన గౌరవం.. ఇక డీఎస్పీ హోదాలో
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) హోదాతో సత్కరించింది. భారత క్రికెట్ జట్టు తరపున గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తుండంతో దీప్తీకు గౌరవం లభించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతిల మీదగా దీప్తి తన నియామక పత్రాన్ని అందుకుంది. అదే విధంగా దీప్తికి డీఎస్పీ పోస్ట్‌తో పాటు రూ.3 కోట్ల రూపాయల నగదు బహుమతిని కూడా యూపీ ప్రభుత్వం అందజేసింది. ఇక డీఎస్పీ హోదాతో తనను సత్కరించినందుకు శర్మ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. యూపీతో పాటు భారత దేశ వ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఇండియా టూడేతో శర్మ పేర్కొంది. మరోవైపు పారా ఏషియన్ గేమ్స్‌లో భాగమైన అథ్లెట్లు జతిన్ కుష్వాహా, యశ్ కుమార్‌లకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు క్యాష్ ఫ్రైజ్‌ను యోగి అందజేశారు. అదే విధంగా నేషనల్ గేమ్స్‌లో పతకాలు సాధించిన స్నూకర్ ఛాంపియన్ పరాస్ గుప్తా, రైఫిల్ షూటర్ ఆయుషి గుప్తాలకు కూడా రూ. 5 లక్షల నగదు బహుమతి లభించింది. చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా? -
ముందస్తు ‘కుట్ర’తోనే రైతులను తొక్కించారు
లఖీంపూర్ ఖేరి: లఖీంపూర్ ఖేరి హింసాకాండలో నిందితులు ముందస్తుగా రచించిన ప్రణాళిక, కుట్ర’తోనే నిరసన తెలుపుతున్న రైతుల పైకి వాహనాన్ని (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్– ఎస్యూవీ) నడిపారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్లో నిందితులపై ఇదివరకు నమోదు చేసిన సెక్షన్లను మార్చి మరింత తీవ్రమైన సెక్షన్లను చేర్చడానికి అనుమతించాలని ఇక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్(సీజేఎం) చింతా రామ్‌కు దరఖాస్తు చేసింది. హత్యాయత్నం సెక్షన్లను జతచేస్తామని విన్నవించింది. ఈ ఏడాది అక్టోబరు 3న లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు... మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా రైతులు నిరసన తెలిపారు. టికూనియా వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి ఎస్యూవీ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారని... ఆయన్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదైంది. ఈ ఘటన అనంతరం కోపోద్రిక్తులైన రైతులు దాడికి దిగడంతో ఎస్యూవీ డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతో సహా 13 మంది నిందుతులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. తీవ్ర దుమారం రేగింది. బీజేపీపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు పంజాబ్, హరియాణా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్‌ను నియమించిన విషయం తెలసిందే. ముందస్తు ప్రణాళికతోనే... దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన ఆధారాలను బట్టి... ఈ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని (వీరు ఆయుధాలు కూడా కలిగి ఉన్నారని)... ప్రాణనష్టానికి దారితీసిందని సిట్ ప్రధాన దర్యాప్తు అధికారి విద్యారామ్ దివాకర్ కోర్టుకు తెలిపారు. అందువల్ల రైతు జగ్మీత్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశిష్ మిశ్రా, తదితరులపై నమోదు చేసిన 220/221 ఎఫ్ఐఆర్లో ఐపీసీ సెక్షన్ 304ఏ (దూకుడుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణం కావడం), సెక్షన్ 338 (నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులను తీవ్రంగా గాయపర్చడం), సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్)లను తొలగించడానికి అనుమతించాలని కోరారు. వాటి స్థానంలో ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం), సెక్షన్ 326 (ప్రమాదకరమైన ఆయుధంతో గాయపర్చడం, ఆయుధాల చట్టంలో సెక్షన్ 3/25ని ఎఫ్ఐఆర్లో చేర్చడానికి అనుమతించాలని కోర్టును కోరారు. ఎఫ్ఐఆర్లో ఇదివరకే నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 147 (అల్లర్లు సృష్టించడం), 148 (ప్రమాదకరమైన ఆయుధాలతో అల్లర్లకు దిగడం), 120బి (కుట్రపూరిత నేరం) తదితర సెక్షన్లను సిట్ కొనసాగించింది. 13 మంది నిందితులకు జారీచేసిన వారెంట్లను సవరించాలని అభ్యర్థించింది. సీజేఎం ఆదేశం మేరకు మంగళవారం నిందితులు కోర్టుకు హాజరయ్యారు. వారెంట్లలో సెక్షన్లను మార్చడానికి సీజేఎం అనుమతించారని ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ ఎస్పీ యాదవ్ వెల్లడించారు. ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ మోదీ జీ.. మీరు మరోసారి క్షమాపణ చెప్పాల్సిన సమయమిది. అయితే దానికి ముందు తొలుత నిందితుడు (అశిష్ మిశ్రా) తండ్రి (అజయ్ మిశ్రా)కి కేంద్రమంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకండి. మత రాజకీయాలు చేసుకోండి. కానీ ఈ రోజు రాజకీయ ధర్మాన్ని పాటించండి. మీరిప్పుడు యూపీలోనే ఉన్నారు కాబట్టి మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించండి. మీ మంత్రిని తొలగించకపోవడం అన్యాయం. సరైనది కాదు!. ఒక మంత్రి రైతులను చంపేందుకు ప్రయత్నించారు. ప్రధానికి ఇది తెలుసు. పార్లమెంటులో ఆనాడు ఈ అంశాన్ని లేవనెత్తాం. కానీ చర్చిండానికి అనుమతించలేదు. గొంతునొక్కారు. – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయండి: ఎస్కేఎం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను రక్షించే ప్రయత్నాలను ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం మానుకోవాలి. ఆయనను మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలి. మేము ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన ఊచకోత అనేది సిట్ దర్యాప్తులో తేలింది. ఈ ఘటన ప్రధాన సూత్రధారి అజయ్ మిశ్రా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా మంత్రిగా కొనసాగుతున్నారు. – సంయుక్త కిసాన్ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య) -
అయోధ్యలో ఆంక్షలు
అయోధ్య/న్యూఢిల్లీ: రామమందిరం–బాబ్రీ మసీదుపై నవంబర్ 17లోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్యలో పలు ఆంక్షలు విధించింది. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈవిషయంలో ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చర్చలు జరపకుండా ఆంక్షలు విధించనున్నారు. డిసెంబర్ 28 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ కాలంలో అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేస్తామని తెలిపింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో అసత్యాల ప్రచారం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, తీర్పు వెలువడిన రోజు దేవతా విగ్రహాల ప్రతిష్టాపన, విజయోత్సవ ఊరేగింపులు జరపకుండా నిషేధం విధించారు. రాళ్లు సేకరించడం, కిరోసిన్, యాసిడ్ అమ్మకాలు కూడా నిలిపివేశారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారుల, పోలీసుల సెలవులను యూపీ ప్రభుత్వం రద్దుచేసింది. -
ప్రభుత్వ పత్రికా ప్రకటనలు ఇక సంస్కృతంలోనూ..
లక్నో, ఉత్తరప్రదేశ్ : యూపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రతికా ప్రకటనలు, ముఖ్యమంత్రి ప్రసంగాలు ఇకనుంచి సంస్కృతంలో కూడా వెలువడనున్నాయని ఆ రాష్ట్ర అధికారులు మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించి మొదటి ప్రెస్ రిలీజ్‌ను సంస్కృతంలో విడుదల చేశారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సంస్కృతం అనేది మన రక్తంలోనే ఉందని, భారతదేశంలో సంస్కృత భాష ఒక భాగమని కానీ, నేడు కేవలం పుజారులకు వృత్తి భాషగా మాత్రమే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతానికి పునర్వైభవం తీసుకురావడానకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమైన ప్రసంగాలు, ప్రభుత్వ సమాచారం హిందీ, ఇంగ్లీష్ మరియు ఉర్దూలతోపాటు సంస్కృతంభాషలోనూ విడుదల చేయనున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ప్రసంగపత్రాన్ని సంస్కృతంలో కూడా విడుదల చేశారు. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రసంగాలను సంస్కృతంలోకి అనువదించడానికి లక్నోకు చెందిన రాష్ట్రీయ సంస్కృత సంస్థ సహాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 25 పత్రికలు సంస్కృతంలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కానీ వాటిలో ఏవి దిన పత్రికలు కావు. -
ఔత్సాహిక నేతల కోసం ట్రైనింగ్ సెంటర్
లక్నో: డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులుగా మారేందుకు ప్రత్యేకంగా కళాశాలలు ఉన్నాయి. అదే తరహాలో రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునేందుకు ఓ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయ శిక్షణా కేంద్రం కోసం రూ.198 కోట్ల నిధులను యూపీ ప్రభుత్వం కేటాయించింది. దాదాపు 16 ఎకరాల్లో ఇక్కడి ఘజియాబాద్ జిల్లా కేంద్రంలో దీని నిర్మాణం జరగనుంది. ఈ శిక్షణా కేంద్రంలో రాజకీయాల్లోకి రావాలనుకునే వ్యక్తులతో పాటు చట్టసభల ప్రతినిధులు చేరవచ్చని యూపీ పట్టణాభివృద్ధి మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా తెలిపారు. ఇక్కడి విద్యార్థులకు వేర్వేరు దేశాధినేతలు, నిపుణులు, రాయబారులు, రాజకీయ ప్రముఖులతో తరగతులు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చే ప్రజలు సందర్శించేందుకు వీలుగా దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో ఉన్న ఘజియాబాద్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ శిక్షణా కేంద్రాన్ని యూపీ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహిస్తుందనీ, దీనికి గుర్తింపు కోసం పలు జాతీయ విశ్వవిద్యాలయాలతో చర్చిస్తున్నామని సురేశ్ కుమార్ పేర్కొన్నారు. పాఠ్యాంశాల రూపకల్పనకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామనీ, మరో రెండేళ్లలో ఈ శిక్షణా కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని చెప్పారు. -
ముఖ్యమంత్రి వద్దే హోం, ఆర్థిక శాఖలు!
శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విమర్శలు వస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనవద్దే ఉంచుకున్నారు. మొత్తం 44 మందితో కూడిన మంత్రివర్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా కీలకమైన శాఖలే ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు ప్రజా పనుల శాఖ, మరో డిప్యూటీ సీఎం దినేష్ శర్మకు పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్యాశాఖలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 24 ఏళ్ల పాటు ఉండి, ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీలోకి వచ్చిన రీటా బహుగుణ జోషి, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్దార్థ నాథ్ సింగ్ లాంటి పెద్దవాళ్లకు కూడా మంత్రిపదవులు లభించాయి. ఇప్పటివరకు తెలిసిన శాఖలు యోగి ఆదిత్యనాథ్: ముఖ్యమంత్రి, హోం శాఖ, ఆర్థిక శాఖ కేశవ్ ప్రసాద్ మౌర్య: ప్రజాపనుల శాఖ దినేష్ శర్మ: పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్య చేతన్ చౌహాన్: క్రీడా శాఖ అశుతోష్ టాండన్: ప్రాథమిక విద్యాశాఖ రీటా బహుగుణ జోషి: సెకండరీ విద్యాశాఖ మొహసిన్ రజా: మైనారిటీ వ్యవహారాలు స్వామి ప్రసాద్ మౌర్య: వ్యవసాయ శాఖ