V Narayana Swamy
-
పాండిచ్చేరిని తాకిన రూ.300 వైద్యం
కర్నూలు(హాస్పిటల్): కరోనా వైరస్ నుంచి బాధితులు త్వరితగతిన బయటపడడానికి స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి సూచించిన రూ.300 వైద్యం ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. ఆదివారం రాత్రి పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు తదితరులు అమెరికాకు చెందిన డాక్టర్లతో పాటు ప్రభాకర్‌రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పాండిచ్చేరిలో కరోనా తీవ్రత గురించి.. దాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో రూ.300 వైద్యం గురించి మంత్రి కృష్ణారావు పాండిచ్చేరి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభాకర్‌రెడ్డి వివరించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మందుల గురించి వివరించానని.. దీనిపై సీఎం నారాయణస్వామి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. పాండిచ్చేరిలోనూ రూ.300 మందులు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితం వచ్చే వరకు వేచి ఉండకుండా రూ.300 మందులు వాడటంవల్ల మంచి ఫలితాలుంటాయని చెప్పారు. -
పుదుచ్చేరి సీఎంకు షాక్
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అధికార సమరంలో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గవర్నర్ నిర్ణయాలతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి సర్కారుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కారుకు పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మారారు. సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికార సమరం రోజు రోజుకూ ముదురుతూనే ఉంది. ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం సిద్ధం కాగా, దానిని అడ్డుకున్నారు. ఉచిత బియ్యంకు బదులుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు పంపిణీకి తగ్గ ఉత్తర్వులు ఇచ్చి సీఎంకు ఆమె షాక్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులను కోర్టు సైతం సమర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ నారాయణ స్వామి అప్పీలుకు వెళ్లి ఉన్నారు. అదే సమయంలో పర్యాటకంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్న పుదుచ్చేరిలో రాష్ట్ర ప్రభుత్వం క్యాసినో క్లబ్స్ (పేకాట) ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంలో కిరణ్ జోక్యం చేసుకున్నారు. క్యాసినోకు నో చెప్పేస్తూనే, చెక్ పెట్టేశారు. ఈ పరిణామాలు సీఎం నారాయణ స్వామి సర్కారును ఇరకాటంలో పడేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో దెబ్బ ఆ సర్కారుకు తప్పలేదు. చదవండి: సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది! ఎన్నికల కమిషనర్ నియమకంలో.. పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ బాలకృష్ణన్‌ను సీఎం నారాయణస్వామి ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి చెక్ పెడుతూ కిరణ్ కొత్త బాట వేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల అధికారి నియమకానికి సంబంధించి పత్రికలకు ప్రత్యేక ప్రకటనలు ఇచ్చి, అర్హులైన వారిని ఎంపిక చేయడం కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాలకృష్ణన్ బాధ్యతలు స్వీకరించడంతో, ఆయన నియమక ఉత్తర్వులను రద్దుచేస్తూ కిరణ్ మరో ఉత్తర్వులిచ్చారు. వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. కిరణ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని మంత్రి నమశివాయం కోర్టు తలుపులు తట్టారు. కొన్ని నెలలుగా విచారణలో ఉంటూ వచ్చిన ఈ పిటిషన్ గురువారం తిరస్కరణకు గురైంది. అఖిల భారత స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానించి, అర్హులైన వారిని ఎన్నికల కమిషనర్ పదవికి ఎంపిక చేయడం అన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది కొత్త మార్గం అని, దీనిని ఆహ్వానించాల్సిన అవసరం ఉందంటూ, ఎన్నికల కమిషనర్ నియమకాన్ని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి సమర్థించారు. ఎన్నికల కమిషనర్ నియమకంలో నారాయణ సర్కారు భంగ పాటే కాదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా పరిస్థితి మారింది. వరుసగా తమ సర్కారుకు ఎదురు దెబ్బలు కోర్టు రూపంలో తగులు తుండడంతో నారాయణకు సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదు. చదవండి: సీఎంకి షాక్ ఇచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు -
అట్టుడుకుతున్న పుదుచ్చేరి..
సాక్షి, చెన్నై : ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదంతో పుదుచ్చేరి అట్టుడుకుతుంది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి.. ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కొన్ని రోజుల క్రితం పుదుచ్చేరి ప్రభుత్వం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలనే నియమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తక్షణమే పాటించాలంటూ కిరణ్ బేడి ప్రజలను ఒత్తిడి చేస్తుండటంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ బేడి చర్యలను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాకు పిలుపున్వివడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో భాగంగా బుధవారం నారాయణ స్వామి కిరణ్ బేడి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీదే నిద్రపోయారు. సీఎంకు మద్దతుగా మంత్రులు, డీఎంకే కార్యకర్తలు కూడా అక్కడే బైఠాయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఈ విషయం గురించి నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను దశల వారిగా అమలు చేయాలి. అంతేతప్ప తక్షణమే జరిగిపోవాలంటూ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. కిరణ్ బేడి చర్యల వల్ల ప్రజల్లో మాపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆమె చర్యలను వ్యతిరేకిస్తూ.. రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చాన’ని పేర్కొన్నారు. అంతేకాక నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే కిరణ్ బేడి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నారాయణస్వామి చేపట్టిన ధర్నాకు డీఎంకే కూడా మద్దతు పలకటంతో భారీ సంఖ్యలో జనాలు రాజ్ భవన్ ముందుకు చేరుకున్నారు. -
‘నిషేధం’పై భగ్గుమన్న విపక్షాలు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కబేళాల కోసం పశువుల క్రయవిక్రయాలను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్ర నిర్ణయాన్ని సమాఖ్య వ్యవస్థపై దాడిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. రంజాన్ మాసం ఆరంభంలోనే కేంద్రం తీసుకున్న చర్య తమపై ప్రత్యక్ష దాడిగా మైనారిటీలు భావించే ప్రమాదం ఉందన్నారు. నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. ప్రజల ఆహారపు అలవాట్లను నియంత్రించే హక్కు కేంద్రానికి లేదని పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కేరళలోని ఆందోళనకారులు పలుచోట్ల బీఫ్ వండి తమ నిరసనను తెలియజేశారు. మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం బ్లాక్ డే పాటిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రకటించింది. నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డీఎంకే కోరింది. మరోవైపు కబేళాలకు పశువుల తరలింపుపై నిషేధాన్ని కేంద్రం సమర్థించుకుంది. ఈ నిర్ణయం వల్ల నిబంధనలకు విరుద్ధంగా జరిగే పశువుల అమ్మకాలతో పాటు స్మగ్లింగ్‌ను అరికట్టడం వీలవుతుందని పర్యావరణ శాఖ తెలిపింది.